కోదాడ, జూన్ 12 : పాఠశాలల బస్సు డ్రైవర్లు బస్సు నడిపేటప్పుడు రహదారి భద్రతా నియమాలు తప్పక పాటించాలని కోదాడ మోటార్ వాహన తనిఖీ అధికారి షేక్ జిలాని అన్నారు. గురువారం కోదాడలో పాఠశాలల బస్సు డ్రైవర్లకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. విద్యార్థులతో వెళ్లే వాహనాల్లో సహాయకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కోదాడ పరిధిలో 220కి పైగా స్కూల్స్, కాలేజీల బస్సులు ఉన్నాయని, అందులో ఇప్పటి వరకు 95 శాతం వాహన సామర్థ్య పరీక్షలు చేయించినట్లు తెలిపారు. మిగిలిన బస్సులు కూడా త్వరగా వాహన సామర్థ్య పరీక్షలు చేయించాలన్నారు.
స్కూల్ యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని, పిల్లలను బస్సు ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బస్సులను నిలుపుదల చేయాలన్నారు. డ్రైవర్లు ఓవర్ టేకింగ్ చేయవద్దని సూచించారు. బస్సు డ్రైవర్లు మద్యం సేవించి, సెల్ఫోన్లు ఉపయోగించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. బస్సులో సీట్లకు సరిపడా విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలని పేర్కొన్నారు.