కోదాడ, అక్టోబర్ 27 : మేజర్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన కోదాడ పట్టణ పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. సందు గొందులలో చెత్త పేరుకుపోయి మురుగు కంపు కొడుతున్నప్పటికీ అధికారులకు మాత్రం చీమ కుట్టినట్టైనా లేదని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. ఆయా కాలనీలోని ప్రజలు పారిశుధ్యంపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం మాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే పాలన బాగుందని, ఇప్పుడు మాత్రం చెత్త పాలన సాగుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
65వ జాతీయ రహదారిపై ఉన్న కోదాడ పట్టణం 80 వేల జనాభాతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. వర్తక, వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ పరిణామంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కోదాడ పట్టణం మున్సిపాలిటీగా రూపాంతరం చెందినప్పటికీ పాలనలో మాత్రం ఆరడుగుల వెనక్కు వెళ్లిందని పట్టణ ప్రజలు బహిరంగ విమర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే పట్టణ పారిశుధ్యం బాగా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉందని ఏ కాలనీ, వీధులు, సందుల్లో చూసినా చెత్త పేరుకుపోయి మురుగు కంపు కొడుతుందని, పారిశుధ్య లోపంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి ఒకసారి కూడా కాలనీలకు చెత్తను సేకరించే వాహనం దర్శనం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Kodada : కోదాడలో పారిశుధ్యం అస్తవ్యస్తం.. పర్యవేక్షణ పట్టని అధికారులు
కోదాడ మున్సిపాలిటీకి ఏడాదికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇంటి పన్నుల రూపంలో తమ ముక్కులు పిండి వసూలు చేస్తున్నప్పటికీ వసతులు మాత్రం శూన్యం అని అంటున్నారు. పాలకవర్గం లేకపోవడంతో అధికారులదే ఇస్తారాజ్యమైంది. పట్టణంలోని రహదారులు గుంతలతో, తేలిన కంకర రాళ్లతో వాహనాలు నడిపే పరిస్థితి లేకుండా పోయింది. ఇక మురికి కాల్వల సంగతి చెప్పనవసరం లేదు. సకాలంలో కాల్వలు శుభ్రం చేయక పోవడంతో వండు పేరుకుపోయి నిల్వ ఉండడంతో కంపు కొడుతున్నాయి. వారానికి ఒకసారైనా మున్సిపల్ ఉన్నతాధికారి కనీస పర్యవేక్షణ లేదని ఈ పరిస్థితిలో సిబ్బంది ఎలా పని చేస్తారనే విమర్శ వినిపిస్తుంది.
పట్టణంలో ఓ పక్క కోతులు మరోపక్క పందులు ఇష్టారాజ్యంగా సంచరిస్తున్నప్పటికీ నిలువరించే దుస్థితి లేదు. కుక్కల బెడదతో చిన్నారులు, వృద్ధులు ఆరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే చిన్నారులు, పెద్దలు కుక్కల కాటున పడ్డారు. ఇక కోతులు ఇళ్లలో జొరబడి నానా పరేషాన్ చేస్తున్నాయి. వీటిని నిలువరించేందుకు మున్సిపల్ అధికారి కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 24 గంటలు మందలు మందలుగా పశువులు సూర్యాపేట, హుజూర్నగర్, ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రధాన రహదారులపై తిష్ట వేస్తున్నప్పటికీ పట్టించుకునే దిక్కు లేదు. పశువుల యజమానులను మందలించే పరిస్థితి లేదు. దీంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

Kodada : కోదాడలో పారిశుధ్యం అస్తవ్యస్తం.. పర్యవేక్షణ పట్టని అధికారులు
కోదాడ పట్టణంలో చిన్న వర్షం వస్తే చాలు వీధులన్నీ జలమయమే. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో వరద నీరు మోకాళ్ల లోతు వీధుల్లోకి ప్రధాన రహదారి పైకి చేరి పారిశుధ్య లోపానికి కారణం అవుతుంది. కోదాడ పట్టణంలో డ్రైనేజీపై అక్రమ నిర్మాణాలు జరగడంతో ఈ దుస్థితి ఏర్పడింది. చర్యలు తీసుకుందామనే చిత్తశుద్ధి లేదని ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పట్టణ సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్య ధోరణిని విడనాడి బాధ్యతతో పట్టణ పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పశువుల యజమానులకు నోటీసులు జారీ చేసి సదరు పశువులను గోశాలకు తరలించాలంటున్నారు. దీంతో పాటు కోతులు, కుక్కల బెడదను నివారించాలని, పారిశుధ్య లోపాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతున్నారు.

Kodada : కోదాడలో పారిశుధ్యం అస్తవ్యస్తం.. పర్యవేక్షణ పట్టని అధికారులు