హాలియా, డిసెంబర్ 19 : నాగార్జున సాగర్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని, ఈ కృషిని ప్రస్తుత సర్కారు ముందుకు తీసుకువెళ్లి పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. స్టేట్ టూరిజం పాలసీపై గురువారం శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా టూరిజానికి ప్రాధాన్యత పెరుగుతున్నదన్నారు. సింగపూర్, దుబాయ్ లాంటి వంటి దేశాలు టూరిజంపైనే ఆర్ధిక పరిపుష్టి సాధించాయన్నారు.
సాగర్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 274 ఎకరాల స్థలంలో బుద్ధవనం నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రపంచ బౌద్ధమత సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న బుద్ధవనాన్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారని తెలిపారు. కానీ, ఆ స్థాయిలో ఇక్కడ సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. ఆ మేరకు వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన, పర్యాటక శాఖపై ఉందన్నారు. ప్రస్తుతం సాగర్ విజయ విహార్‌లో పర్యాటకులకు సరిపోయే విధంగా గదులు లేవన్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడో కాటేజీలు ఏర్పాటు చేసినా, ప్రస్తుతం అవి అధ్వానస్థితికి చేరాయన్నారు. పర్యాటకుల అభిరుచికి తగ్గట్టుగా సాగర్‌లో టూరిజం శాఖ ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూపురేఖలు కోల్పోయిన నెహ్రూ పార్కుతోపాటు సాగర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలోని రాజీవ్ టైగర్ వ్యాలీని మరింతగా అభివృద్ధి చేయాలని కోరారు.