సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకొని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ట్యాంక్‌బండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రావెల్ ఫార్మేషన్, గ్రీనరీ పచ్చనివనంలా ఆకట్టుకుంటున్నది. రంగురంగుల పూల మొక్కలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. కోటీ 26లక్షలతో రాయల్ఫామ్ మొక్కలు నాటగా.. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నిత్యం నీళ్లందిస్తున్నారు. దీంతో అవి ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. పట్టణ ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరుతూ సంబుర పడుతున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండు మినీ ట్యాంక్బండ్లు ఏర్పాటు చేసి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. ఎక్కడా ఎవరికీ సాధ్యం కాని పని చేయడంతోపాటు వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుండగా.. మరో మినీ ట్యాంక్‌బండ్‌గా పుల్లారెడ్డి చెరువు సిద్ధమవుతున్నది. సద్దుల చెరువు వద్ద రకరకాల చెట్లతో ఆకుపచ్చని ఆవరణ చూపరులను కట్టి పడేస్తున్నది. ప్రజలకు చల్లటి వాతావరణం, ఆహ్లాదం, ప్రశాంతతను అందించేందుకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.కోటీ 26లక్షలతో కట్టపై 1,250 రాయల్ ఫామ్ చెట్లు, బోగన్విలియా (కాగితం పువ్వు) మొక్కలను నాటారు. వాటికి నీళ్లు అందించేందుకు కట్ట చుట్టూ సుమారు 5కి.మీ. మేర డ్రిప్ లైన్‌ను వేశారు. దీంతో మొక్కలు ఏపుగా పెరిగి పూలు పూస్తూ పచ్చని వనాన్ని తలపిస్తున్నాయి.
వీటితోపాటు మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో సీఎస్ఆర్ నిధులు రూ.9.20కోట్లతో సద్దుల చెరువు కట్ట వెంట గ్రీనరీ ఏర్పాటులో భాగంగా గ్రావెల్ ఫార్మేషన్, గ్రీనరీ, బోటింగ్, గజీబోస్, చెరువు పక్కన రోడ్డు వెడల్పు, ఫుడ్ స్టాల్ (రెస్టారెంట్), పిల్లల క్రీడా ప్రాంగణం మొదలైనవి ఏర్పాటు చేస్తుండగా.. పనులు శరవేగంగా సాగుతున్నాయి. కట్ట వెంట ఏర్పాటు చేసిన గ్రావెల్ ఫార్మేషన్, గ్రీనరీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సద్దుల చెరువు కట్టపై ఐ లవ్ ఇండియా, ఐ లవ్ తెలంగాణ, ఐ లవ్ సూర్యాపేట అంటూ ఏర్పాటు చేసిన ఆకారాలు చూడముచ్చటగా ఉన్నాయి. దీంతో కట్ట వెంట వచ్చి పోయేవాళ్లు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సంబుర పడుతున్నారు. ఇప్పటికే ప్రారంభమైన బోటింగ్‌తో ప్రజలు ఆనందాన్ని పొందుతుండగా కట్ట వెంట తయారైన గ్రీనరీతో అమితానందం పొందుతున్నారు. ఇంతటి ఆనందాన్ని తమ సొంతం చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డికి రుణపడి ఉంటామని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.
సర్వాంగ సుందరంగా అభివృద్ధి
మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో సద్దుల చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. ఇప్పటికే బోటింగ్‌తో ప్రజలు ఆహ్లాదం పొందుతున్నారు. కట్ట వెంట ఏర్పాటు చేసిన గ్రావెల్ ఫార్మేషన్, గ్రీనరీ చూడముచ్చటగా ఉన్నాయి. చెరువులో పైలాన్ నిర్మాణం, ఫుడ్ స్టాల్ ఏర్పాటు పనులు సాగుతున్నాయి. ప్రజలు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ మినీ ట్యాంక్‌బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
– పెరుమాళ్ల అన్నపూర్ణ, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్
మినీ ట్యాంక్‌బండ్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ను రాష్ర్టానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడానికి మేమంతా కృషి చేస్తున్నాం. నిరంతరం పర్యవేక్షిస్తూ కట్ట వెంట నాటిన మొక్కలకు డ్రిప్ ద్వారా నీళ్లు అందిస్తూ ఆకుపచ్చని వాతావరణాన్ని కల్పించాం. మొక్కలు రంగు రంగుల పూలు పూస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జరుగుతున్న అభివృద్ధిలో పట్టణ ప్రజలంతా భాగస్వాములు కావాలి.
– పి.రామానుజులరెడ్డి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్
పూల మొక్కలు చాలా బాగున్నాయి
వారాంతంలో ఆహ్లాదం కోసం సద్దుల చెరువు వద్దకు వస్తుంటాను. కట్ట వెంట ఏర్పాటు చేసిన గ్రావెల్ ఫార్మేషన్ చూడముచ్చటగా ఉన్నది. మొక్కలతో ఐ లవ్ తెలంగాణ, ఐ లవ్ సూర్యాపేట అక్షర మాల ఏర్పాటు చేయడం అద్భుతంగా అనిపించింది. ప్రస్తుతం కట్ట వెంట వేసిన మొక్కలు పెద్దగా అవుతూ పూలు పూస్తుండడంతో ఆ ప్రదేశం కన్యాకుమారిని తలపిస్తున్నది. ఇంత అభివృద్ధి చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డికి మేమంతా అండగా ఉంటాం.
– బాలెంల కరుణ, సూర్యాపేట పట్టణం