తుంగతుర్తి, జనవరి 23 : యాసంగి పంటకు వెంటనే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికే రెండు పంట సీజన్లలో రైతు భరోసా ఎగ్గొట్టిందని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు కేటీఆర్, హరీశ్ రావుపై అక్రమ కేసులు పెడుతూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లాకావత్ యాకు నాయక్, నల్లబెల్లి వెంకటేష్, పోడేటి లతిఫ్ పాల్గొన్నారు.