నీలగిరి, ఆగస్టు 15 : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగి, త్యాగాల నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. త్యాగాలకు కేరాఫ్ అంటేనే నల్లగొండ అని, జిల్లా అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం అనేక మంది ఉద్యమాలు నిర్వహించారని, నేటి మన స్వేచ్ఛా వాయువుల వెనుక దాగి ఉన్న నాటి సాయుధ రైతాంగ పోరాట అమరవీరులు, నల్లగొం డ బిడ్డల త్యాగాలు నేడు గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించేలా కులగణన చేశామని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కంకణం కట్టుకున్నామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచి జిల్లాలో 37,211 మంది పేదలులకు 105.33 కోట్లు ఖర్చు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 65, 276 కొత్త రేషన్ కార్డులను మం జూరు చేశామన్నారు. నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ క్రింద 24,886 ఎకరాల ఆయకట్టును పెంచటానికి రూ.664.80 కోట్లు పరిపాలన ఆమోదం పొంది పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కేశవాపురం, కొండ్రపోల్ లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ పనులకు 75.93 కోట్లు, బొత్తలపాలెం -వాడపల్లి-వీర్లపాలెం, తోపుచర్ల, దున్నపోతుల గండి- బాలేన్పల్లి-చాంప్లా తండా సీమ్లకు రూ.275.13 కోట్లు మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
2025-26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 38,539 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేయడంతోపాటుగా 3,66,872.45 టన్నుల వివిధ ఎరువులను పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం 4761.71 టన్నుల యూరియా, 242 85.61 మెట్రిక్ టన్నుల వివిధ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో జిల్లా లో 807.29 లక్షల సబ్సిడీతో 10 వేల 475 వివిధ యంత్ర పరికరాలు సరఫరా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో రూ.110.74 కోట్లతో 40 విద్యుత్ ఉప కేం ద్రాలను మంజూరు చేసి అందులో తొమ్మిదిని పూర్తి చేశామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, దీనిని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకవస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్లాంట్లో రోజుకు సుమారు 38.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణకు మిషన్ పరివర్తన్ కార్యక్రమం చేపట్టి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడం, గంజాయి రవాణాను అరికట్టడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం సెయింట్ అల్పోన్స్ స్కూల్ వద్ద స్కైవాక్ వంతెనకు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎం ఏ, ఆఫీజ్ ఖాన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ , రెవెన్యూ అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేశ్, ఏసీసీ మౌనిక, జిల్లా సీనియర్ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.