చౌటుప్పల్, ఏప్రిల్ 06 : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో రోడ్డు పనులు నత్త నడకన నడువడంతో స్థానిక వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని ఎమ్మెల్సీ నెలికంటి సత్యం అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని రోడ్డు ప్లై ఓవర్ పనులను స్థానిక సిపిఐ నాయకులతో కలిసి బస్టాండ్ ముందు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఫోన్లో మాట్లాడి పనులు త్వరగా అయ్యేవిధంగా చూడాలని కోరారు. రోడ్డు పనులు జాప్యం కావడం వల్ల ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా మున్సిపాలిటీలోని వ్యాపారస్తులు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ రోడ్డు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పూర్తిచేసే విధంగా మాట్లాడుతానన్నారు. వారి వెంట సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, నాయకులు పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడత రామలింగం, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్, దాసరి మనోహర్ వెంకటేష్ పాల్గొన్నారు.