నీలగిరి, మార్చి 30: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆశా వరర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలంటూ చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆశలను మహిళలని చూడకుండా అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం ఏంటని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ఖండించారు. సోమవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని ఆశా కార్యకర్తలంతా నల్లగొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశ కార్యకర్తలకు పారితోషకాలు కాకుండా ఫిక్స్డ్ వేతనంగా రూ.18 వేలు ఇస్తామని ప్రకటించిందన్నారు. గెలిచి రెండున్నర సంవత్సరాలవుతున్న హామీ అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా హామీ అమలు చేయాలని కోరుతూ చలో హైదరాబాద్ వెళ్తున్న ఆశా కార్యకర్తలను ముందు రోజు రాత్రి ఇండ్ల మీద పడి మహిళలని చూడకుండా అర్థరాత్రి అరెస్టు చేశారన్నారు.
కొంతమంది ఏదో విధంగా హైదరాబాద్ వెళ్లిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ర్యాలీగా వెళ్తున్న ఆశా కార్యకర్తలను, సీఐటీయూ నాయకులను పోలీసులు నిర్బంధించి సూదులతో గుచ్చడం, గిచ్చడం వంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ప్రజా పాలన అని చెబుతూ ఉద్యమకారులపై నిర్బంధ కాండను ప్రయోగించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి నిర్బంధ చర్యలు మానుకోకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యురాలు సీహెచ్ అనురాధ, ఆశా వరర్స్ యూనియన్ తిప్పర్తి, కనగల్ , రాములబండ, నల్లగొండ అర్బన్ లైన్ వాడ, మాన్యంచెల, పానగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా కార్యకర్తలు పార్వతమ్మ, కె.స్వర్ణ, వజ్రమ్మ, వీరభద్రమ్మ, ప్రేమలత, అనురాధ, జీవనజ్యోతి, ప్రమీల, రాజేశ్వరి, హేమలత, మాధవి, మహేశ్వరి పాల్గొన్నారు.