రామగిరి, జూలై 14 : పిల్లల సంపూర్ణ మూర్తిమత్వానికి, మనో వికాసానికి బాల గేయాలు దోహద పడుతాయని నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నల్లగొండలోని పీఆర్టీయూ భవనంలో జిల్లాలోని చిన్నమాదారం ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు, ప్రముఖ రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రచించిన “ఊగుతున్న ఉయ్యాల” బాల గేయాల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సరళమైన భాషలో విద్యార్థులు సులువుగా పాడుకునే విధంగా బాల గేయాలున్నాయన్నారు.
భవిష్యత్లో విద్యా వికాసానికి తోడ్పడే మరిన్ని రచనలు చేయాలని, ఇటువంటి రచనలతో పిల్లల అభ్యసనాభివృద్ధి మరింత మెరుగు పడగలదని ఆయన అన్నారు. ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఇటువంటి పుస్తకాలు ఉంటే విద్యార్థులు అభ్యసనం పట్ల మరింత శ్రద్ధ చూపుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియుటిఎస్ ర్రాష్ట అధ్యక్షుడు గుండు లక్ష్మణరావు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కాలం నారాయణరెడ్డి, పుస్తక రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు, సంఘం నాయకులు కళావతి, యూసుఫ్ పాషా, సైదిరెడ్డి, నామిరెడ్డి వెంకట్రెడ్డి, వెంకటరమణ, ర్రాష్ట , జిల్లా బాధ్యులు, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.