కోదాడ, నవంబర్ 25 : దిన దినాభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణ ప్రజల అవసరాల దృష్ట్యా మూడు సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ చొరవతో మున్సిపాలిటీ పాలకవర్గం ప్రత్యేక తీర్మానం చేసి 75 మంది పారిశుధ్య సిబ్బందిని మరో 35 మందిని ఇతర పనులకు కాంట్రాక్టు పద్ధతిలో ఎంపిక చేశారు. ఎంపికైన వారంతా దళిత బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువ. ఎంపికైన నాటి నుంచి రెండు సంవత్సరాల వరకు రెండు, మూడు నెలలకొక్కసారి అయినా వేతనాలు తీసుకున్నారు. అయితే సంవత్సరం నుంచి వారి కష్టాలు మొదలు అయ్యాయి. బడ్జెట్ లేదని, ఇక వేతనాలు ఇవ్వలేమని మున్సిపల్ కమిషనర్ తేల్చి చెప్పడంతో సదరు పారిశుధ్య సిబ్బంది బతుకులు వీధిన పడ్డాయి. వెన్నుదండుగా ఉండాల్సిన పాలకవర్గ సభ్యులు నోరు మెదపకపోవడంతో పారిశుధ్య సిబ్బంది అభద్రతా భావంతో ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల క్రితం గత ఐదు నెలలుగా అందాల్సిన వేతనాల కోసం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ గోడును వెల్లబోసుకున్నారు.
కాంగ్రెస్ పాలనలో మొదలైన కష్టాలు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హరితహారంతోపాటు ప్రత్యేక నిధుల నుంచి 105 మంది కార్మికులకు సజావుగా వేతనాలు చెల్లించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో హరితహారం కార్యక్రమం నిలిచిపోయింది. ఇక మున్సిపాలిటీకి పలు రూపాల్లో వసూలు అయిన డబ్బులు కాంట్రాక్టర్లకే వెచ్చించాల్సి వచ్చింది. ఈ దుష్పపరిణామంతో 105 మంది కార్మిక సిబ్బందికి వేతనాలు ఇవ్వ డం భారంగా మారింది. వీరి ఎంపిక సీడీఎంఏ నిబంధనల ప్రకారం జరుగలేదని, తాత్కాలిక వేతనాలు చెల్లించే నిబంధనతోనే వీరు కొనసాగుతున్నారని, ప్రస్తుతం బడ్జెట్ లేనందున జీతాలు ఇవ్వలేమని ము న్సిపల్ అధికారులు తెగేసి చెబుతున్నారు.
మభ్యపెడుతున్న మున్సిపల్ కౌన్సిలర్లు
మున్సిపాలిటీ పరిధిలోనే ఆయా వార్డుల్లో పారిశుధ్య పనులు నిర్వహించేందుకు వార్డుకు ఇద్దరు చొప్పున 35 వార్డులకు గానూ 75 మందిని నియమించుకున్నారు. ఒకరు, ఇద్దరు అదనంగా కూడా నియమించుకున్నట్లు తెలిసింది. మెజార్టీ కౌన్సిలర్లు పారిశుధ్య సిబ్బందిని నియమించినందుకు వారి వద్ద నుంచి రూ.రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐదు నెలల నుంచి తమకు వేతనాలు అందడం లేదని, తమ పరిస్థితి ఏమిటని కౌన్సిలర్ల వద్ద తమ గోడును వెల్లబోసుకున్న నేపథ్యంలో మభ్య పెడుతున్నట్లు సమాచారం. గతంలో ఎంపిక అంశంలో ఆరోపణలు వచ్చినా కొందరు కౌన్సిలర్లు, ఈ అపవాదు తమకెందుకు అని తిరిగి తీసుకున్న సొమ్మును వాపసు చేసినట్లు తెలుస్తుంది. తమ వేతనాలు అందడం లేదని, ఉద్యోగాలకు భద్రత కల్పించాలని పారిశుధ్య సిబ్బంది స్థానిక ఎమ్మెల్యేను కలిసి మొరపెట్టుకున్నారు.
దీర్ఘకాలికంగా వేతనాలు ఇవ్వడం కష్టం
కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంపిక చేసిన 105 మంది పారిశుధ్య సిబ్బంది, కార్మికులకు దీర్ఘకాలికంగా వేతనాలు ఇవ్వడం కష్టం. ఈ అంశంలో మున్సిపల్ నిబంధనలు ఆమోదించవు. మానవతా హృదయంతో మాత్రమే వేతనాలు ఇస్తున్నాం. భవిష్యత్తులో ప్రభుత్వం నిబంధనలు సడలిస్తే ఔట్సోర్సింగ్ కింద వీరికి ప్రాధాన్యత ఇస్తామే తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు. సీడిఎం వైపు ప్రతిపాదన కూడా పంపాం. మరో రెండు నెలల వేతనం ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం.
– రమాదేవి మున్సిపల్ కమిషనర్
పారిశుధ్య సిబ్బందికి వేతనాలు చెల్లించాల్సిందే
తాత్కాలిక వేతనంపై ఎంపికైన 105 మంది సిబ్బందికి వేతనాలు తప్పనిసరిగా చెల్లించాలి. వారిలో మెజార్టీగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఇందుకు పాలకవర్గంతో పాటు ఉద్యోగులు బాధ్యత వహించాలి. పారిశుధ్య సిబ్బందికి వాస్తవాలు తెలియజేయకుండా నియమించారు. దీంతో పాటు సదరు సిబ్బంది నుంచి కొందరు కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై సమగ్ర విచారణ జరుపాలి.
– కుదరవెల్లి బసవయ్య, సామాజిక కార్యకర్త