భూదాన్‌పోచంపల్లి, జూలై 15 : గౌరెల్లి నుంచి భద్రాద్రి వరకు కొత్తగా నిర్మించనున్న జాతీయ రహదారి 930 కోసం తమకున్న కొద్దిపాటి పంట భూములను లాక్కుంటే తామెలా భూదాన్ పోచంపల్లి బతకాలని మండలంలోని భీమనపల్లి, మెహర్‌నగర్ గ్రామాల రైతులు అధికారులను ప్రశ్నించారు. జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి సమావేశమై అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించారు.
తమకు సదరు భూమే ఆధారమని, ఒక వేళ ప్రభుత్వం భూమి తీసుకుంటే ప్రభుత్వం అందించే ఎకరానికి రూ.24 .50 లక్షలు కాకుండా రూ. 80 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ భూ నిర్వాసితులకు పరిహారం పెంపు విషయమై కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తారని సూచించారు. భీమనపల్లిలో 72 మంది రైతులకు చెందిన 23.07 ఎకరాలు, మెహర్‌నగర్‌లో 35 మంది రైతులకు చెందిన 8.07 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు. తాసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సురేందర్శర్మ, అధికారులు పాల్గొన్నారు.