– సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్
కోదాడ, జూన్ 08 : కోదాడ నియోజకవర్గంలో యదేచ్చగా అధికార పార్టీకి చెందిన నేతలు భూకబ్జాలు ఆక్రమణలకు పాల్పడుతుంటే నిలువరించాల్సిన సంబంధిత అధికారులు చేష్టలుడిగి వారికి వత్తాసు పలుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం కోదాడలో తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కోదాడ పెద్ద చెరువును ఇప్పటికే రెండు వందల ఎకరాలు కబ్జా చేశారని తాజాగా సూర్యాపేట రోడ్డులోని పెట్రోల్ బంక్ పక్కన 20 కోట్ల విలువచేసే 2000 గజాల చెరువు కబ్జాకు గురవుతున్నప్పటికీ నీటిపారుదల శాఖ అధికారులు గాని, మున్సిపల్ అధికారులు గాని చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటన్నారు. కోదాడ నడిబొడ్డున యాదవ నగర్ లో లక్షల విలువ చేసి మునిసిపాలిటీ స్థలంలో ఆ వార్డుకు చెందిన ఓ కాంగ్రెస్ నేత రెండు నెలల క్రితమే ఆక్రమించుకుని భారీ బండికొట్టును ఏర్పాటు చేసినప్పటికీ మున్సిపల్ కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.. ఈ అంశంపై పట్టణంలోని స్వచ్ఛంద సంఘాల బాధ్యులు పార్టీల బాధ్యులు పలుమార్లు కమిషనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకొని మున్సిపల్ స్థలాన్ని కాపాడాలన్నారు.
పాత మున్సిపాలిటీలోని సామాగ్రిని అద్దె భవనానికి మార్చుకునేందుకు 28 లక్షల రూపాయల బిల్లును మున్సిపల్ కమిషనర్ లెక్కల్లో చెప్పిందని, ఇదేమిటని కౌన్సిలర్లు నిలదీసినప్పటికీనిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుందన్నారు.. ఆమె వెనుక అదృశ్య హస్తం ఎవరో అందరికీ తెలిసిందే అన్నారు.. దీంతోపాటు పాలకవర్గ అనుమతి లేకుండా తనకు ఇష్టం వచ్చిన రీతిగా తాత్కాలిక ఉద్యోగులను నియమించి లక్షల దండుకుందనే ఆరోపణలు కూడా బహిరంగంగానే వినిపిస్తున్నాయన్నారు.. ఇక నియోజకవర్గంలో గుడిబండ కాపుగల్లు సింగారం తో పాటు పలు గ్రామాల శివారులలో ప్రభుత్వ భూములలోని అనుమతులు లేకుండా మట్టిని తోడుకొని లక్షలు దండుకుంటున్న అధికారులకు మాత్రం చీమకుట్టినట్టైనా లేదని విమర్శించారు.. అక్రమ ఇసుక రవాణా ది కూడా అదే పరిస్థితి అని, అధికార పార్టీకి చెందిన నేతలేఈ అక్రమాలకు పాల్పడుతున్న విషయం బహిరంగమే అన్నారు. రెవెన్యూ అధికారులు తమ దృష్టికి రాలేదని తప్పించుకుంటున్నారే కానీ చర్యలు తీసుకోవడం లేదన్నారు.. పోలీసులు అధికారులది అదే పరిస్థితి అని అన్ని శాఖలు అవినీతిమయంగా మారాయి అన్నారు.
పలు శాఖల అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ఎమ్మెల్యే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇక మున్సిపాలిటీలో ఎ లాంటి టెండర్ లేకుండా సెంట్రల్ లైటింగ్ పనులకు 50 లక్షలు ఖర్చు ఖర్చు చేయడం పై విచారణ జరపాలని.. చివరకు సమోసాలకు 40 లక్షల ఖర్చు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.. నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చెబుతున్నారని ఆచరణలో మాత్రం అమలు కావడం లేదనటానికి శిలాఫలకాలే సాక్షిభూతాలన్నారు.. సంబంధిత అధికారులు రాజకీయ వత్తిళ్లకు గురికాకుండా విధులు నిర్వహించాలన్నారు.. అయ్యా శాఖల అధికారుల పై వస్తున్న ఆరోపణలకు కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశంలో మండల పట్టణ నాయకులు రమేష్, భూపాల్ రెడ్డి, ఉపేందర్. కందిబండ సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, ఉపేందర్ గౌడ్, కరీముల్లా బాబా, మణికంఠ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.