కొండమల్లేపల్లి, జూలై 24: బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ నియోజవర్గంలోని దాదాపు వెయ్యి మందికిపైగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్ ఆధ్వర్యంలో డీఈ విద్యుత్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత తొలి సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను కొనసాగించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మధ్యలో వివిధ రకాల పేర్లతో కోతలు విధించడం సిగ్గుచేటన్నారు. ట్రాన్స్ఫార్మర్లకు రిపేర్ వస్తే అధికారులు స్పందించే సరికి పొలాలు ఎండిపోతున్నాయన్నారు. అధికారుల తీరుతో విసిగిపోతున్న రైతన్నలు సొంత డబ్బుతో రిపేర్ చేయించుకొంటున్నారని అన్నారు. విద్యుత్ కోతల కారణంగా పెట్టిన మడికే మళ్లీ పెట్టాల్సి వస్తోందన్నారు.
లోవోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని, కేసీఆర్ పదేండ్ల పాలనలో పచ్చగా ఉన్న రాష్ర్టాన్ని ఆరాచకాలతో కాంగ్రెస్ రాజ్యమేలుతోందని విమర్శించారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురిచేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా వసూలు చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీల, 420 బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి అధికారమదంతో వీర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. అనంతరం డీఈకి వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యానాయక్, నేనావత్ కిషన్‌నాయక్, కంకణాల వెంకట్‌రెడ్డి, గాజుల అంజనేయులు, పార్టీ మండలాల అధ్యక్షులు టివిఎన్‌రెడ్డి, రాజనేని వెంకటేశ్వర్రావు, దంతం చంద్రశేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాస్‌రావు, చింతపల్లి సుభాష్‌గౌడ్, బోడ్డుగోపాల్గౌడ్, కేసాని లింగారెడ్డి, ముత్యపురావు, ఉజ్జిని విద్యాసాగర్‌రావు, ముత్యాల సర్వయ్య, శ్రీనివాస్‌గౌడ్, లోక్యానాయక్, బాలయ్య, కేతావత్ రవీందర్, అంజిరెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, లింగం యాదవ్, నేనావత్ వంకర్నాయక్, రావుల వెంకటయ్య, రమావత్ తులసీరాంనాయక్,రమావత్ దాప్లాల్నాయక్, రాజశేఖర్‌రెడ్డి, కావాటి వెంకటేశ్, జబ్బు యాదయ్య పాల్గొన్నారు.