ఉమ్మడి జిల్లాకు మరో మంత్రి పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి ఖాయమంటూ కొంతకాలంగా నెలకొన్న ఊహాగానాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెరదించింది. ఆదివారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో జిల్లా నుంచి కొత్తగా ఎవరికీ స్థానం కల్పించలేదు. మంత్రి పదవిపై గంపెడాశలతో ఎదురుచూస్తున్న రాజగోపాల్‌రెడ్డికి పార్టీ మొండిచెయ్యి చూపగా ఎస్టీ సామాజికవర్గం నుంచి మంత్రి పదవిని ఆశించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు కూడా నిరాశే మిగిలింది. దీనంతటికీ జిల్లా పార్టీలోని ముఖ్యుల మధ్య ఉన్న ఆధిపత్య పోరే కారణమన్న చర్చ జోరుగా సాగుతున్నది.
నల్లగొండ ప్రతినిధి, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే మంత్రివర్గంలో ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే తర్వాత విస్తరణలో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందన్న ఆశతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. దీనికి ఎంపీ ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ ప్రతిపాదికగా ఉంది. ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో పార్టీ అధిష్టానం చెప్పినట్లుగా రాజగోపాల్‌రెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అందుకే సొంతంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎంపీ చామల కిరణ్ గెలుపులో రాజగోపాల్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో ఇక అప్పటి నుంచి తనకు ఎప్పుడు విస్తరణ జరిగినా మంత్రి పదవి ఖాయమన్న ధోరణిలో ఉన్నారు.
పలు సందర్భాల్ల్లో తన అనుచరులతో పాటు మునుగోడు నియోజకవర్గంలోనే ఇదే విషయాన్ని బహిరంగంగానూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ధీమాను ఆయన అనుచరులు వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ తీరా పార్టీ అధిష్టానం మాత్రం తాజా విస్తరణలో ఆయనకు చోటు ఇవ్వలేదు. కేవలం ముగ్గురితోనూ సరిపెడుతూ అది కూడా ఎస్పీ సామాజికవర్గం నుంచి ఇద్దరికీ, బీసీల నుంచి ఒక్కరికీ మాత్రమే కొత్తగా మంత్రి పదవులు కట్టబెట్టింది. దీంతో రాజగోపాల్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు సైతం నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందువల్లనే ఆదివారం తెల్లవారుజాము నుంచే రాజగోపాల్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రి గడ్డం వివేక్‌లకు సైతం ఎన్నిమార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. చివరకు సాయంత్రం దాటాక మీనాక్షీ నటరాజన్, మంత్రి వివేక్‌లు రాజగోపాల్‌రెడ్డిని కలుసుకోగలిగారు. వారు ఎంత బుజ్జగించినా రాజగోపాల్‌రెడ్డి ససేమిరా అంటూ తనకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం మాట ఇచ్చి తప్పడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మిగిలిన మూడు మంత్రి పదవుల్లోనైనా అవకాశం కల్పించాల్సిందేనని రాజగోపాల్‌రెడ్డి తేల్చిచెప్పినట్లు తెలిసింది. లేదంటే తన దారి తాను చూసుకోవాల్సి వస్తుందని ఘాటుగానే హెచ్చరించినట్లు ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతున్నది.
మంత్రివర్గంలో ఎస్టీ లంబాడీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గట్టి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఉమ్మడి జిల్లా నుంచి రాజగోపాల్‌రెడ్డి కూడా మంత్రి పదవిపై గట్టి ప్రయత్నాల్లో ఉండగా ఆయనకు ఇస్తే తనకు రాదన్న అంచనాతో బాలునాయక్ ఉన్నారు. ఇదే జరిగితే తనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పినట్లు పలు సందర్భాల్లో బాలునాయక్ ప్రకటించారు.
తాజా విస్తరణలో తనకు మంత్రి పదవి రాకున్నా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాయమని ఆదివారం ఉదయం వరకు బాలునాయక్ ధీమాతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. తీరా రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి జెడ్పీ చైర్మన్‌గా గెలిచిన బాలునాయక్‌ను కాదని మహబూబాబాద్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాంచంద్రునాయక్ వైపు పార్టీ మొగ్గు చూపడం షాక్‌కు గురిచేసింది. బాలునాయక్ సైతం ఏమీ మాట్లాడలేని పరిస్థితి. జిల్లాకు చెందిన ముఖ్యులే తనకు పదవి దక్కకుండా అడ్డుపడ్డారని భావిస్తున్నట్లు అనుచరులు పేర్కొంటున్నారు.
జిల్లాకు చెందిన మంత్రులు మరో మంత్రి పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవికి అడ్డుపడినట్లుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతున్నది. రాజగోపాల్‌రెడ్డి విషయంలో ఆది నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యక్షంగా, తన సోదరుడు వెంకట్‌రెడ్డి పరోక్షంగా అడ్డుపడుతున్నట్లు ఆయన అనుచరులు, సన్నిహితులు భావిస్తున్న విషయం తెలిసిందే. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తే తనకు ఉన్న ఆర్థ్ధిక హార్దిక శక్తులతో ఉమ్మడి జిల్లాలో తమ ప్రాబల్యం తగ్గిపోతుందన్న భయంలో ఇద్దరూ మంత్రులు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.
ఒకవేళ మంత్రి పదవి వస్తే ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డికి దగ్గరగా వ్యవహరిస్తారని కూడా భావిస్తున్నట్లు సమాచారం. వీటన్నిటి నేపథ్యంలోనే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నట్లుగా రాజగోపాల్ సన్నిహితులు, కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో బాలునాయక్‌కు సైతం డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే ప్రొటోకాల్ పరంగా మంత్రులతో సమానంగా జిల్లాలో వ్యవహరించడానికి అవకాశం ఉన్నది. ఈ పరిణామాలు సాధారణంగానే ప్రస్తుత మంత్రులు ఇష్టపడరని, అందుకే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా జిల్లా నుంచి పక్క జిల్లాకు తరలిపోయేలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.