Ground water | దామరచర్ల, మే 2 : గతంలో సాగునీటి కోసం అల్లాడిన ఆ పల్లెలు నేడు జలసిరులతో కళకళలాడుతున్నాయి. మండలంలోని నర్సాపురం, రాజగట్టు, తిమ్మాపురం, కల్లేపల్లి, పుట్టలగడ్డ తండాల్లో గిరిజనులు ఏడేండ్ల క్రితం సాగునీటి కోసం అల్లాడిపోయారు. పంటలను కాపాడుకునేందుకు పదుల సంఖ్యలో బోర్లు వేసినా గంగమ్మ జాడ కానరాలె. దీంతో అప్పులపాలైన రైతులు వ్యవసాయాన్ని వదిలి కూలి పనులకు పోయారు. ఇప్పుడా పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీసి సాగర్ జలాలతో నింపడంతో భూగర్భజలాలు పెరిగాయి. ఫలితంగా ఇప్పుడు ఎక్కడ వేసినా బోర్లు పడుతున్నాయి. గుట్టల మీద సైతం పుష్కలంగా పోస్తుండడంతో రైతులు రెండు కార్లు వరి పండిస్తున్నారు.
మండలంలోని రాజగట్టు గ్రామ శివారులో గతంలో ఎన్ని బోర్లు వేసినా నీళ్లు రాకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వదిలేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువుల్లో పూడిక తీయించి ప్రతి ఏడాది సాగర్ జలాలతో నింపారు. ఫలితంగా మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతోపాటు ప్రతి ఏడాది అనుకున్న రీతిలో వానలు పడటంతో ఇప్పుడు ఎక్కడ వేసినా బోర్లు పడుతున్నాయి. రైతులు వేసిన బోర్లన్నీ సక్సెస్ కావడంతో ఆ ప్రాంతం పచ్చని పంటలతో కళకళలాడుతున్నది. గతంలో నెర్రెలు బారిన నర్సాపురం చెరువు నిండుకుండను తలపిస్తున్నది. దీంతో పరిసర ప్రాంతంలో నీరు సమృద్ధిగా లభిస్తున్నది. నేటికీ మండలంలో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. గుట్టలపై వేసినా బోర్లు పడుతున్నాయి. వేసవిలో సైతం ఆగకుండా పోస్తున్నాయి. దీనికితోడు ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు ఇబ్బందుల్లేకుండా రెండు కార్లు వరి పంట పండిస్తున్నారు.