నీలగిరి, నవంబర్ 7 : ‘ర్యాగింగ్‌ను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు’ అని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవో అశోక్‌రెడ్డితో కలిసి ఆమె కళాశాలను సందర్శించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, హెచ్వోడీలు, అధ్యాపక బృందం, విద్యార్థి సంఘాల నాయకులు, మెంటర్లు, సీనియర్, జూనియర్ విద్యార్థులతో కలెక్టర్ విడివిడిగా చర్చించారు.
మీడియాలో వచ్చిన కథనాలపై ఆరా తీసి కళాశాలలో జరిగిన సంఘటనలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తమను ఎవరూ ర్యాగింగ్ చేయలేదని, స్నేహపూర్వక వాతావరణంలోనే ఉన్నామని కలెక్టర్‌కు విద్యార్థులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు విద్యార్థుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లతో స్నేహపూర్వకంగా మెలిగినట్లు తమ చర్చల్లో తేలిందన్నారు.

కళాశాలల్లో ర్యాగింగ్ జరగకుండా వైద్య కళాశాలకు మెంటర్లను, ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినా, రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఎలాంటి రికమండేషన్లు పని చేయవన్నారు. విలువైన జీవితాన్ని విద్యార్థులు కోల్పోవాల్సి ఉంటుందన్నారు. ఏవైనా సమస్యలుంటే విద్యార్థులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
సమాజంలో మంచి డాక్టర్‌గా సేవలందించే విషయంపై వైద్య విద్యార్థులు దృష్టి సారించాలన్నారు. తల్లిదండ్రులను బాధపెట్టకుండా వారి గురించి ఆలోచించాలన్నారు. ర్యాగింగ్ చేస్తే కళాశాల నుంచి బహిషరణకు గురి కావడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదవుతాయని, దీంతో జీవితమే నాశనమవుతుందని హెచ్చరించారు. కళాశాలలో తలెత్తిన ర్యాగింగ్ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు, సీసీ టీవీ ఫుటేజీలను సైతం పరిశీలించామని ఆమె స్పష్టం చేశారు. ఇకపై వైద్య కళాశాలలో ఆకస్మికంగా విద్యార్థుల గదులను తనిఖీ చేస్తామన్నారు. ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా సమస్యలుంటే విద్యార్థులు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, నల్లగొండ ఆర్డీవోకు తెలియజేయాలని సూచిస్తూ.. వారి ఫోన్ నంబర్లను విద్యార్థులకు తెలిపారు.