నల్గొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 24 : ఉన్నత విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ జి. అంజిరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలో గల నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జరిగిన అకాడమిక్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు అతిగా సెల్ ఫోన్లు వినియోగిస్తూ తమ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారన్నారు. తప్పులు లేకుండా, భావం చెడకుండా ఒక వాక్యo రాయలేని వారే ఎక్కువగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి తగు చర్యలు చేపట్టాలని సూచించారు.
మూల్యాంకనం కూడా తగు రీతిలో చేపడితేనే విద్యార్ధి క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతాడని అన్నారు. వర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డా.రేఖ మాట్లాడుతూ ఆడ్ ఆన్ కోర్సుల్లో భాగంగా కృత్రిమ మేధను చేర్చాలని సూచించారు. విశ్రాంత ఆచార్యులు డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా తరగతి గదుల్లో సెల్ ఫోన్ వినియోగించవద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు పాఠాలు చెప్పిన జియాలజీ గురువు డా.వీరయ్య పేరు మీద ప్రతి ఏటా బంగారు పతకాన్నిఇవ్వన్నున్నట్లు ప్రకటించారు. అలాగే మరో రెండు బంగారు పతకాలను అందజేసేందుకు ముందుకు వచ్చిన డా.అంతటి శ్రీనివాస్, వెంకట్ రెడ్డి లను ఆయన అభినందిచారు.
పారిశ్రామికవేత్త శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. కళాశాలకు కంప్యూటర్ల అందజేతకు కృషి చేస్తానని తెలిపారు. 2025-2026 విద్యా సంవత్సరoలో అమలయ్యే పలు కీలక నిర్ణయాలను తీసుకున్న ఈ సమావేశంలో అకాడమిక్ కౌన్సిల్ చైర్మన్, కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డా. అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రాణాధికారి బత్తిని నాగరాజు, ఐక్యుఎసి కో ఆర్డినేటర్ డా. ప్రసన్న కుమార్, అధ్యాపకులు డా. ముని స్వామి, డా. భట్టు కిరీటం, డా. వెల్దండి శ్రీధర్, అనిల్ బొజ్జ, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కోటయ్య, జ్యోత్స్న, శివరాణి, సావిత్రి, విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Higher Education : ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలి : ఎంజియూ ప్రొఫెసర్ అంజిరెడ్డి