ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి సమస్య ప్రధానంగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే నీటి వనరులు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పట్టణాల్లో గుక్కెడు నీటికీ ప్రజలు అవస్థలు పడేది. సూర్యాపేట పట్టణంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. దాంతో నాటి పాలకులు హైదరాబాద్ నుంచి వచ్చే మూసీ మురుగు నీటినే తాగునీటి అవసరాలకు సరఫరా చేసేవారు. ఆ నీటిని తాగిన ప్రజలు అనేక రోగాల బారిన పడేవారు. ఇదే అదునుగా వాటర్ ప్లాంట్లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. కోట్ల రూపాయల నీటి వ్యాపారం జరిగేది. స్వరాష్ట్రంలో సూర్యాపేట పట్టణ ప్రజల నీటి కష్టాలు తీరాయి. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గెలిచిన వెంటనే నల్లగొండ ఉదయ సముద్రం నుంచి కృష్ణానీటిని అందించే ఏర్పాటు చేశారు. అనంతరం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన జలాలు సరఫరా చేస్తున్నారు. పట్టణంలో దాదాపు రూ.90 కోట్లతో ట్రీట్మెంట్ ప్లాంట్‌తోపాటు 13 మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించారు. 90 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేశారు. ఎక్కడా నీటి ఇబ్బందులు లేకుండా విధుల్లో 38 మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తమకు నీటి కష్టాలు తీరాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రపంచంలో ఏ ప్రాంత ప్రజలు కూడా తాగనటువంటి మురుగు నీటిని గత పాలకులు సూర్యాపేట పట్టణ ప్రజలకు తాగించారు. అప్పట్లో హైదరాబాద్ నుంచి వచ్చిన మూసీ మురుగు నీరే వారికి దిక్కయ్యేది. దీంతో మంచినీటి కోసం దశాబ్దాల తరబడి ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. అయినా.. గత పాలకులు పట్టించుకోలేదు. మురుగు నీరే తాగునీరు కావడంతో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంచినీటి వ్యాపారం తొలుత ప్రారంభమైందీ ఇక్కడే. డబ్బులు పెట్టి నీటిని కొనుక్కొని తాగడం సూర్యాపేటలోనే కావడం గమనార్హం. కానీ.. స్వరాష్ట్రంలో ఆ సమస్య తీరింది. ఇప్పుడు స్వచ్ఛమైన తాగునీరు ఇంటింటికీ అందుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి మూడేండ్ల పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో పట్టణ ప్రజల దాహర్తి తీరగా.. తదనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథతో శుద్ధి జలాలు పుష్కలంగా అందుతున్నాయి. దాంతో సంతోషంగా ఉన్న పట్టణ ప్రజలు.. గతం ఓ పీడకలగా గుర్తుకు వస్తుందంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కాదు కదా.. కనీసం స్వచ్ఛమైన తాగునీరు కూడా అందేది కాదు. రోడ్లు, మురుగు కాల్వల వంటి కనీస మౌలిక వసతులు కల్పించలేదు. ఈ నేపథ్యంలోనే ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన సూర్యాపేట పట్టణ ప్రజలు గత ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యానికి గురై అనేక అవస్థలు పడ్డారు. గుంతలమయమైన రహదారులు, గుంతల్లో మురుగు నీరు, విద్యుత్ కోతలు, దోమల స్వైరవిహారం.. ఇలా అనేక సమస్యలు ఉండేవి. నేడు మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సూర్యాపేటలో అన్ని సమస్యలూ పరిష్కారమై అభివృద్ధిలో దూసుకుపోతూ ప్రజలకు సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి.
గతంలో మురుగు నీరే సూర్యాపేటకు పన్నీరు
ప్రపంచంలో ఎక్కడా ఒక ప్రాంతంలో వాడి వదిలేసిన నీటిని మరో ప్రాంతంలో తాగునీటిగా వినియోగించిన దుస్థితి లేదు. కానీ.. సమైక్య పాలనలో సూర్యాపేటకు మాత్రం అది దక్కింది. హైదరాబాద్ నుంచి విసర్జనకు గురైన మురుగు నీటినే సూర్యాపేటకు తాగునీటిగా అందించారు. దశాబ్దాల తరబడి రంగు మారి, దుర్వాసనతో కూడిన నీటినే వారం నుంచి పది రోజులకోసారి నల్లాల ద్వారా సరఫరా చేస్తే బిందెలు, కుండల్లో దాచి మళ్లీ నల్లా వచ్చేవరకూ గొంతు తడుపుకొనేవారు. ఫలితంగా ప్రజలు అనేక రోగాల బారిన పడేవారు. ఇదే అదనుగా కొంతమంది నీటి వ్యాపారానికి తెరలేపారు. ఇష్టారాజ్యంగా నీటి శుద్ధి ప్లాంట్లు నెలకొల్పి సరైన నిబంధనలు పాటించకుండా 20లీటర్ల నీటిని రూ.20 నుంచి 30 రూపాయల వరకు విక్రయించారు. నాటి పాలకులు, అధికారుల పుణ్యమా అని అప్పట్లో మంచినీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి వ్యాపారం ప్రారంభమైంది సూర్యాపేటలోనే కావడం గమనార్హం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రజలకు సకల సౌకర్యాలతోపాటు స్వచ్ఛమైన తాగునీరు పుష్కలంగా అందుతున్నది. దాంతో నీటి వ్యాపారానికి బ్రేకులు పడ్డాయి.
రూ.1200 కోట్లతో మిషన్ భగీరథ పనులు..
సూర్యాపేట జిల్లాలో రూ.1200 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టగా.. పట్టణానికి సుమారు రూ.90 కోట్లు అయినట్లు అంచనా. ఉండ్రుగొండ గుట్ట కింద ట్రీట్మెంట్ ప్లాంటులో ప్యూరిఫై అయిన నీటిని గుట్టపై ఉన్న భారీ ట్యాంకుల్లోకి ఎక్కిస్తారు. అక్కడి నుంచి 800 డయా మీటర్ల పైపులైన్లతో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నిర్మించిన 5లక్షల లీటర్ల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పంపిస్తున్నారు. తదనంతరం పట్టణంలోని 5లక్షల లీటర్ల కెపాసిటీ గల 5 ఓవర్ హెడ్ ట్యాంకులతోపాటు 3లక్షల లీటర్లవి మూడు, 2లక్షల లీటర్లవి నాలుగు.. మొత్తం 12 ట్యాంకులకు పంపిస్తారు. ఆ ట్యాంకుల ద్వారా పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీటిని పంపించేందుకుగాను 80 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్, 12 కిలోమీటర్ల మెయిన్ పైపులైన్లు కొత్తవి వేయడంతోపాటు పాతవాటిని ఆధునీకరించారు. పట్టణంలో నిరంతరాయంగా తాగునీటిని ఇంటింటికీ అందించేందుకు డీఈ నుంచి ఆపరేటర్ల వరకు అధికారులు, సిబ్బంది మొత్తం 38 మంది నిరంతర పర్యవేక్షణ, పనులు చేస్తున్నారు. ఫలితంగా నేడు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు వస్తుంది. ఇప్పుడు దాహర్తి తీరడంతో సంతోషంగా ఉన్న పట్టణ ప్రజలు.. గతం తలుచుకుంటే ఓ పీడకలగా గుర్తుకు వస్తుందంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి పుణ్యాన స్వచ్ఛమైన నీరు తాగుతున్నామని పట్టణ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథతో తీరిన మంచినీటి సమస్య
2014లో తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలి మూడేండ్లు మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సూర్యాపేట పట్టణ దాహర్తి తీరింది. తదనంతరం సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో తాగునీటి రంది పూర్తిగా లేకుండా పోయింది. సొంత రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతోపాటు స్థానిక సమస్యలపై దృష్టి సారించి తాగునీటి సమస్యను పరిష్కరించారు. హైదరాబాద్ విసర్జించిన మురుగు నీరు ఎండిపోయిన మూసీ నదిలో తవ్విన ఓ గుంత నుంచి మోటర్లతో సూర్యాపేటకు తాగునీరుగా తరలిస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ సమీపంలోని ఉదయ సముద్రం నుంచి ప్రత్యేకంగా కాల్వ తవ్వించి కృష్ణానీటిని మూసీకి తీసుకొచ్చారు. అలాగే సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కేవలం తాగునీటి కోసమే నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయించారు. దాంతో గతంలో వారానికోసారి దుర్వాసనతో కూడిన రంగుమారిన నీళ్లు పోయి కృష్ణాజలాలను రోజు విడిచి రోజు అందించారు. ఇలా 2014 నుంచి మూడేండ్ల పాటు మంత్రి చొరవతో తాగునీటి సమస్య తీరగా.. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ 2017లో పూర్తయింది. నాటి నుంచి ప్రతి ఇంటికీ నిత్యం స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది.
ఆరోగ్యంగా ఉన్నా.. మోకాళ్ల నొప్పులు తగ్గాయి
నేను చాలా ఏండ్ల నుంచి సూర్యాపేట మున్సిపాల్టీ సరఫరా చేసే మంచినీటినే తాగుతున్నా. తెలంగాణ రాష్ట్రం రాకముందు మూసీ నీరు సరఫరా చేయడంతో నీళ్లు చాలా మురుకిగా వచ్చేవి. గత్యంతరం లేక వాటినే తాగేవాళ్లం. ఆ మురికి నీళ్ల కోసం మా బజారు నల్లా దగ్గర గంటలకొద్దీ నిలబడి ఒకటి, రెండు బిందెలు పట్టుకునేది. వాడుకోవడానికి నీళ్లు దొరకాలంటే అమ్మలక్కలం కొట్లాడుకోవాల్సి వచ్చేది. మూసీ నీళ్లు తాగినన్ని రోజులు ఒళ్లంతా, మోకాళ్లు విపరీతమైన నొప్పులు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సార్ పుణ్యాన స్వచ్ఛమైన మంచినీటిని తాగుతున్నాం. ఈ నీళ్లు తాగినప్పటి నుంచి నాకు ఎలాంటి నొప్పులు లేవు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.
– నడిపెల్లి భవాని, శ్రీశ్రీనగర్, సూర్యాపేట పట్టణం
ఆనాడు మూసీ మురికి నీైళ్లెనా వారం ఎదురుచూసినం
2014కు ముందు ఏండ్ల తరబడి మూసీ మురికి నీళ్లు తాగినం. ఎండాకాలం వచ్చిందంటే ఆ నీళ్లు కూడా సరిగా దొరక్కపోయేది. వారానికోసారి ట్యాంకర్ వస్తే ఆ నీళ్ల కోసం బిందెలతో తన్నులాడుకున్నం. తెలంగాణ వచ్చినంక మంత్రి జగదీశ్‌రెడ్డి సారు గెలిచినకాన్నుంచి మంచినీళ్లు తాగుతున్నం. ఎండాకాలంలో చుక్కనీరు లేకుండా ఎండిపోయిన సద్దుల చెరువు మంత్రి జగదీశ్‌రెడ్డి వచ్చినంక ఒక్కసారి కూడా ఎండిపోలేదు. ఎండలు ఎంత ముదిరినా నిండు కుండలా చెరువు నిండా నీళ్లు ఉంటున్నాయి. నాలుగైదేండ్ల కింద ఒకసారి చెరువు ఎండిపోతే కృష్ణా నీళ్లు తెప్పించి మంచినీళ్ల కష్టాలు రాకుండా చూసిండ్రు. ఎక్కడి కృష్ణా నీళ్లు ఇక్కడికి ఎట్లోచ్చినయి అని అంతా ఆశ్చర్యపోయినం. ఇప్పుడు గోదావరి నీళ్లు కూడా వస్తున్నయి. ఇక మాకు నీటి కష్టాలు తొలిగినట్టే. ఇప్పుడు ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు అందుతూ నిత్యం మంచినీళ్లు వస్తున్నయి. ఇదివరకు మూసీ మురికి నీళ్లతో ఆరోగ్యాలు ఆగమై ఆసుపత్రులపాలైనం. ఇప్పుడు రోజూ పుష్కలంగా మంచినీళ్లు వస్తుండటంతో తాగడానికే కాకుండా ఇంట్లో మొక్కలకు కూడా పెడుతున్నం.
– పోలెబోయిన కోటమ్మ, గృహిణి, సూర్యాపేట పట్టణం