రామగిరి, ఆగస్టు 26 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేలా ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)తోపాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయ సమావేశాలు(పీటీఎం) నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతినెలా మూడో శనివారం సమావేశం నిర్వహించి ప్రతి తరగతిలోని విద్యార్ధి తల్లిదండ్రులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా పాఠశాల హెచ్ఎంలకు ఆదేశాలు జారీచేసింది. మొదటి సారిగా నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,181 పాఠశాలల్లో పీటీఎం నిర్వహించేలా విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొనేలా..
పిల్లల విద్య పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో సజావుగా సాగుతుంది. పాఠశాల అభివృద్ధిలో ఇప్పటి వరకు ఎస్ఎంసీలో ప్రతి తరగతి నుంచి ఎంపికైన ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులే పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతి విద్యార్ధి తల్లిదండ్రులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం పీటీఎంకు శ్రీకారం చుట్టింది. పాఠశాల, విద్యార్థుల సమస్యలు, లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.
ఫొటోలు, నివేదికను పంపించాలి
విద్యార్థుల చదువు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేలా ప్రభుత్వం పీటీఎం నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. నేడు ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో ప్రారంభిస్తున్నాం. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో చర్చించిన అంశాల నివేదికను మండల విద్యా వనరుల కేంద్రంలో సమర్పించాలి. మీటింగ్ ఫొటోలు విధిగా ఉన్నతాధికారులకు పంపించాలి. పీటీఎంను అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాల్సి బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉంది.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
3,181 పాఠశాలల్లో సమావేశాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,181 ప్రభుత్వ పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు నిర్వహిస్తారు. నల్లగొండ జిల్లాలో 1482, సూర్యాపేట జిల్లాలో 918, యాదాద్రి భువనగిరి జిల్లాలో 781 పాశాలలున్నాయి. వీటన్నింటిలో ఎస్ఎంసీతోపాటు పీటీఎం సమావేశాలు నిర్వహించి విద్యార్థుల చదువు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు.