సూర్యాపేట, మే 27 (నమస్తే తెలంగాణ) : భయ మో భక్తో లేక అభిమానమో తెలియదు కానీ సూర్యాపేటలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి ఎలాంటి హోదా లేని ఓ ప్రైవేట్ వ్యక్తికి సలాం కొడుతున్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని 22,23 వార్డుల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సైతం సదరు వ్యక్తి ఫొటో పెట్టడమే కాకుండా జిల్లా మంత్రి ఉత్త మ్ కుమార్‌రెడ్డి ఫొటో కంటే పెద్దదిగా పెట్టి స్వామి భక్తిని చాటుకున్నారు. సదరు వ్యక్తి ఫొటో పెట్టడమే కాకుండా మంత్రి ఫొటో కంటే పెద్దది పెట్టడం పట్ల ఒకరిద్దరు అధికార పార్టీ వారే ప్రశ్నిస్తే బతిమాలి సర్ది చెప్పారట. బక్రీద్ సందర్భంగా ఈద్గాను పరిశీలించేందుకు ప్రైవేట్ వ్యక్తితో కలిసి డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు సందర్శించడం విమర్శలకు తావిస్తోంది.
ఈ రెండు సంఘటనలు పరిశీలిస్తే అధికారులు ఏ స్థాయిలో దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల వెంకటేశ్వరస్వామి దేవాలయం, భక్తాంజనేయస్వామి టెంపుల్లలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల ఆహ్వాన పత్రికలో సైతం ఏ హోదాలేని సదరు వ్యక్తి పేరు పెట్టడమే కాకుండా కనీసం ప్రొటోకాల్ పాటించకపోవ డంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా అధికారుల తీరు మార్చుకోకుండా చీరల పంపిణీ కార్యక్రమంలో ఫ్లెక్సీ పెట్టడమే కాకుండా పెద్ద ఫొటో పెట్టడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా అధికారిక కార్యక్రమం జరిగితే ప్రతి పక్షం నుంచి సర్పంచే కాదు చివరకు వార్డు మెంబర్ ఉన్నా ఆహ్వానించి గౌరవం ఇచ్చేవారని ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రైవేట్ వ్యక్తులను వేదిక పైకి ఆహ్వానించేవారు కాదన్నారు. నేడు ఒక మూకగా ప్రైవేట్‌వారు కార్యక్రమాన్ని ఆక్రమిస్తున్నారని అధికారులే వాపోతున్నారు. ఇలా చేయమని ఎవరైనా ప్రోత్సహిస్తున్నారో..బెదిరిస్తున్నారో తెలియదు కానీ సూర్యాపేటలో సదరు వ్యక్తి తీరు, అధికారుల వ్యక్తి పూజ తారస్థాయికి చేరుతోంది.
కాంగ్రెస్ పాలనలో అ న్ని ప్రభుత్వ వ్యవస్థల ను బ్రష్టు పట్టిస్తున్నారని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ ధ్వజమెత్తారు. ఇందిరా మహిళా శక్తి చీరల పం పిణీ సందర్భంగా ఏర్పా టు చేసిన ఫ్లెక్సీలో ప్రైవేట్ వ్యక్తి ఫొటో పెట్టడమే కాకుండా మంత్రి కంటే ప్రైవేట్ వ్యక్తి ఫొటోను పెద్దగా పెట్టడంపై అధికారుల తీరు ఏంటో వారే వివరణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని, ఎటువంటి ప్రొటోకాల్ లేని ప్రైవేట్ వ్యక్తులను ప్రభుత్వ కార్యక్రమాల వేదికలపై కూర్చోబెట్టి భజనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.