నిడమనూరు, ఏప్రిల్ 15: ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన యువతి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగిన ఘటన సోమవారం రాత్రి నిడమనూరు (Nidamanuru) మండలం బొక్కమంతలపాడు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ నిమ్స్ దవాఖానాలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తుంది. అదే గ్రామానికి చెందిన కుక్కల జాన్‌రెడ్డి రిహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తుండగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకోవాలని మల్లీశ్వరి కోరగా మొహం చాటేసిన జాన్ రెడ్డి మరో యువతిని పెళ్లాడాడు. తీవ్ర మనస్థాపానికి గురైన మల్లీశ్వరి ఆదివారం హాస్టల్లో విషపూరిత ఇంజక్షన్‌ను చేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన ఇతరులు పోలీసులకు సమాచారం అందించారు. హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. స్వగ్రామమైన బొక్కమంతలపాడుకు మృతదేహాన్ని తరలించి మల్లీశ్వరి మృతికి కారణమైన జాన్ రెడ్డి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి న్యాయం చేయాలంటూ సోమవారం అర్ధరాత్రి దాటేవరకు ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న హాలియా సీఐ జనార్దన్ గౌడ్, నిడమనూరు ఎస్సై ఉప్పు సురేష్ లు సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. మల్లీశ్వరి సూసైడ్ నోట్ ఆధారంగా సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 9 మందిని తక్షణమే అరెస్ట్ చేయాలని భీష్ముంచారు.. మంగళవారం ఉదయం 10 గంటల వరకు వారిని అరెస్టు చేస్తామంటూ పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని మల్లీశ్వరి నివాసానికి తరలించారు.