రామగిరి, ఆగస్టు 21 : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించినప్పటికీ నల్లగొండ జిల్లాలోని 124 పాఠశాలల్లో ఇప్పటి వరకు ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను నియమించకపోవడం సరికాదని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీటీయూటీఎఫ్) నల్లగొండ జిల్లా కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. నియామకాలను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీయూయూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల ఆనంద్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ప్రారంభించిన 124 ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసి, రెండు నెలలు దాటినా ఇప్పటి వరకు నియామక ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. దీనివల్ల ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతోందన్నారు.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నియామకాలు ఆగిపోయాయని తెలిసిందని, అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి మాట్లాడుతూ తక్షణమే నియామక ప్రక్రియ పూర్తి చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. అనంతరం డీఈవో, కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్‌రెడ్డి జిల్లా కోశాధికారి వడ్త్యా రాజు, జిల్లా కార్యదర్శులు యాట మధుసూదన్ రెడ్డి, నాయకులు ఎడ్ల సైదులు, గేర నరసింహ, మోర్తాల శ్రీనివాసరెడ్డి, మురళయ్య, నలపరాజు వెంకన్న, కొమర్రాజు సైదులు, ఆడిట్ కమిటీ సభ్యులు నరసింహమూర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి నర్రా సరళ, భాను ప్రకాష్, సోషల్ మీడియా కన్వీనర్ యరనాగుల సైదులు, రాగి రాకేష్, సీహెచ్ రవీందర్, దాసరి ప్రభాకర్, పద్మ, రమణమ్మ, సూర్య కళ, సంధ్య, రమణ, నాగయ్య, సెలక్షన్ లిస్టులో ఉన్న మెరిట్ అభ్యర్థులు పాల్గొన్నారు.