న్యూఢిల్లీ, ఆగస్టు 21 : బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. వరుసగా రెండు రోజులుగా పుంజుకుంటున్న ధరలు శుక్రవారం మూడు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి. డాలర్‌కు క్రమంగా బలహీనపడుతుండటం, అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,200 ఎగబాకి రూ.1,63,500 పలికింది. అంతకుముందు ఇది రూ.1,62,300గా ఉన్నది.
మే 19 తర్వాత ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.5 వేలు అధికమై రూ.2.50 లక్షలకు చేరుకున్నది. గడిచిన రెండు రోజుల్లో వెండి రూ.15 వేలు పెరిగినట్టు అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 81.58 డాలర్లు లేదా 2 శాతం బలపడి 4,600.91 డాలర్లకు చేరుకోగా, వెండి మూడు శాతం బలపడి 69.87 డాలర్లు పలికింది.