హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాంగ్రెస్‌లో ‘సురేఖ వర్సెస్ రేవంత్’ వార్ పీక్స్‌కు చేరింది. సినిమా ప్రముఖులపై వ్యాఖ్యలు, సొంత పార్టీ నేతలతో విభేదాల నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి వర్గం పట్టుబడుతున్నది. 17మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సురేఖపై చర్యలు కోరుతున్నా కాంగ్రెస్‌లోని మెజారిటీ సీనియర్లు మాత్రం మౌనం వహిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో ఇది కేవలం ఓ మంత్రి వ్యవహారంగా కాకుండా పార్టీలోని అంతర్గత ఆధిపత్య పోరుకు, ‘ఒరిజినల్ కాంగ్రెస్ -వలస నేతల’ మధ్య నెలకొన్న విభేదాలకు ప్రతిబింబంగా మారింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కాంగ్రెస్ సీనియర్ నేతగా, బీసీ కార్డు, వరంగల్ క్యాడర్ సమీకరణాలు, సొంత పార్టీలోని ‘ఒరిజినల్ వర్సెస్ వలస’ నేతల అంతర్గత పోరు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని తొందరపాటు చర్యలు అవసరం లేదని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో ఏం జరుగుతున్నదో పూర్తిగా తెలుసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని ఢిల్లీ సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి చెప్పారు. ముందుగా ఏఐసీసీ దూత మీనాక్షీ నటరాజన్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నదని, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించి ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకుంటుందని, చివరగా టీపీసీసీ అధ్యక్షుడి వివరణ కోరిన తర్వాతే కొండా సురేఖపై తుదినిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. ఒక వేళ ఆమెపై చర్యలకు ఉపక్రమించినా బర్తరఫ్ మాత్రం ఉండదని, గౌరవ ప్రదమైన చర్యలే ఉంటాయని ఆయన స్పష్టంచేశారు.
సురేఖను హఠాత్తుగా బర్తరఫ్ చేస్తే తలెత్తే రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసీ మహిళా నేతగా ఉన్న సురేఖపై వేటు వేస్తే ‘కాంగ్రెస్ బీసీ నాయకత్వాన్ని అణచివేస్తున్నది’ అనే రాజకీయ ప్రచారాన్ని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉన్నదని ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలిసింది. బీసీ మహిళా నేత బర్తరఫ్ అంటే దేశ వ్యాప్తంగా పార్టీలపై ప్రభావం చూపుతుందని ఏఐసీసీ ఆందోళనతో ఉన్నట్టు సమాచారం. మరోవైపు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబానికి ఉన్న గట్టి కేడర్ బహిరంగ తిరుగుబాటు చేస్తే భవిష్యత్తు ఎన్నికల్లో, రాబోయే స్థానిక సంస్థల సమరంలో పార్టీ ఓటు బ్యాంకు గల్లంతవుతుందనే భయం హైకమాండ్‌ను వెంటాడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పార్టీలో ‘వలస నేతలు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్’ పోరు నడుస్తున్న వేళ, సురేఖపై చర్యలు పాత కాంగ్రెస్ నేతల్లో తిరుగుబాటు గళాన్ని మరింత పెంచేలా ఉన్నాయని, ఇప్పటికే పార్టీలో అంతర్గత అసంతృప్తి, ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో తొందరపాటు చర్య మరింత చిచ్చు రేపే ప్రమాదం ఉన్నదని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వేదికగా గట్టిగా పట్టుబడితే తప్ప తక్షణ బర్తరఫ్ సాధ్యం కాకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. క్రమశిక్షణ పేరుతో చర్యలు తీసుకుంటే వచ్చే రాజకీయ లబ్ధి కంటే బీసీల ఆగ్రహంతో జరిగే నష్టమే అధికమని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు, సురేఖ నుంచి వివరణ తీసుకుని హెచ్చరికలతో వివాదానికి తెరదించే యోచనలో ఉన్నారు. ఒకవేళ సీఎం పట్టుతో చర్యలు అనివార్యమైనా.. వెంటనే వేటు వేయకుండా, రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో శాఖ మార్పు లేదా మర్యాదపూర్వకంగా పకనబెట్టడం లాంటి ‘సాఫ్ట్ రూట్’ను అధిష్ఠానం ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.