నేరేడుచర్ల, జూన్ 14 : స్థానిక వాహనదారులకు ఉచిత ప్రయాణం కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టోల్గేట్ యాజమాన్య వైఖరికి నిరసనగా ఈ నెల 16న చిల్లేపల్లి టోల్గేట్ వద్ద రాస్తారోకోను నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ధూళిపాల ధనుంజయనాయుడు తెలిపారు. రాస్తారోకోను పార్టీలకు అతీతంగా జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో జరిగిన వవివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల సమావేశంలో ధనుంజయనాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో అనేకచోట్ల టోల్గేట్ పరిధిలోని 20 కిలోమీటర్ల వరకు వాహనదారులకు ఉచిత ప్రయాణం కల్పించాల్సి ఉండగా యాజమాన్యం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
ఈ సమావేశంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేశ్, బీఆర్ఎస్ నాయకుడు రాపోలు నవీన్‌కుమార్, టీడీపీ మండలాధ్యక్షుడు ఇంజమూరి వెంకటయ్య, జనసేన జిల్లా అధ్యక్షుడు సరికొప్పుల నాగేశ్వరావు, ఏఐవైఎఫ్ జల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, ఎమార్పీఎస్ మండలాధ్యక్షుడు యడవల్లి అరుణ్, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు ఊదర వెంకన్న, యడవల్లి వెంకటకృష్ణ, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు భరత్ పాల్గొన్నారు.