సూర్యాపేట, మే 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రతిపక్షాలపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. పలు సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులు, కార్యకర్తలను నిర్బంధం చేసి అడ్డుకుంటున్నది. ప్రజాస్వామ్యంగా ఆందోళనలు, నిరసనలు చేయకుండా అరెస్ట్‌లు చేస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం తెగనమ్మేందుకు కుట్రలు చేస్తుండగా అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకులపై తిరుగబడుతున్నది.
హెచ్‌సీయూ భూముల రక్షణ కోసం మంగళవారం బీఆర్ఎస్వీ, సీపీఎం, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ తదితర సంఘాల నాయకులను హైదరాబాద్‌లో హెచ్‌సీయూ వద్దకు వెళ్లన్వికుండా నిర్బంధించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. సోమవారం రాత్రి నుంచే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
సూర్యాపేట జిల్లాలో పెన్‌పహాడ్, ఆత్మకూర్.ఎస్, అర్వపల్లి, తిరుమలగిరి, చిలుకూరు, నాగారం, పాలకవీడు, కోదాడ, మేళ్లచెర్వు, తుంగతుర్తి, హుజూర్నగర్.. నల్లగొండ జిల్లాలో తిప్పర్తి, మునుగోడు, దేవరకొండ, నార్కట్‌పల్లి, తిరుమలగిరి సాగర్, కేతేపల్లి, శాలిగౌరారం, దామరచర్ల, చిట్యాల.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు, రామన్నపేట, ఆత్మకూర్.ఎం, మోటకొండూరు, భువనగిరి, వలిగొండ, భూదాన్‌పోచంపల్లిలో నాయకులను అరెస్టు చేశారు.
సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలాన్ని ఆపాలని, భూముల అమ్మడం ద్వారా సమకూర్చుకోవాలని చేసే ఆలోచన మంచిది కాదని నాయకులు అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేసి భయభ్రాంతుకుల గురి చేయడం తగదని, అక్రమ అరెస్టులకు భయపడేది లేదని హెచ్చరించారు.