నీలగిరి, నవంబర్ 14 : బాలల హక్కు మనందరి బాధ్యత అని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం మహిళా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల శాఖ ఆద్వర్యంలో నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క సెక్టార్ పరిధిలోని రహమత్ నగర్ అంగన్వాడీ కేంద్రంతో పాటు పలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో వివిధ వేషధారణలు నిర్వహించి బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. పిల్లలపై చదువుపై టీచర్లు శ్రద్ధ చూపి నైపుణ్యాలు పెంచుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వం బాలల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని గుర్తించాలన్నారు.
బాలికల విద్యను ప్రోత్సహించాలని బాల కార్మిక, బాల్య వివాహాల నిర్మూలన, బాలికల అక్రమ రవాణ అరికట్టాలన్నారు. ఆడ పిల్లల కోసం బేటి బచావో లాంటి కార్యక్రమాలు అమలులో ఉన్నాయన్నారు. సమస్యలుంటే 1098 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. అంతకుముందు నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులకు ఆటపాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు జయమ్మ, పార్వతి, అంగన్వాడీ టీచర్లు గుత్తా జ్యోతి, కవిత, ప్రేమలత, పర్వీన్, ఖుర్షీదాబేగం, అనిత, ఆయాలు బానుచంద్ర, జ్యోతి, సైదమ్మ తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.

Nilagiri : బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత : సీడీపీఓ తూముల నిర్మల