నీలగిరి, జూన్ 25 : నల్లగొండ పట్టణ శివారులో కలకలం రేపిన ఒకే కుటుంబంలోని నలుగురి హత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. తల్లి పేరున ఉన్న తన తండ్రి ఆస్తి కోసమే హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి హత్యకు పథకం రచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మొదటి భర్త కుతురు బుష్రా బతుల్, అల్లుడు అర్హన్ అతని అక్కతో కలిసి కిరాయి హంతకులతో ఆ నలుగురిని మట్టుబెట్టినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన రౌడీ షీటర్లకు రూ. 20లక్షలు సుపారీ ఇచ్చి సుల్తాన్, హసీనా కుటుంబాన్ని హతమార్చారు.
కరుడుకట్టిన హంతక ముఠా సభ్యులు పదునైన కత్తులతో ప్రతి ఒక్కరిని ఛాతిపై భాగం నుంచి మెడ, తలనే టార్గెట్ చేసి హత్యలకు పాల్పడ్డారు. కుమారుడు ముజామ్మిల్ శరీరంపై 16, హసీనాకు 7, కూతరు అప్సర్‌కు తొమ్మిది, సుల్తాన్ శరీరంపై ఆరు కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. హత్యలు జరిగిన రెండు మూడు రోజుల తరువాత పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాలను స్వాధీనం చేసుకుని మూడు రోజులపాటు పరిశోధించి నిందితులను గుర్తించారు. ఈ సంఘటనలో సుమారు 150 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వేలిముద్రలు, క్లూస్ టీమ్, డాగ్స్కాడ్స్, ఐడీ పార్టీ, సెల్‌ఫోన్, సీడీఆర్‌ల ఆధారంగా విచారణ చేపట్టినప్పటికీ నిజాలు వెలుగు చూసేందుకు చాలా అలస్యమైనట్లు పోలీసులు చర్చించుకుంటున్నారు. సెల్ఫోన్ల సీడీఆర్ ఆధారంగానే నిందితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
నల్లగొండ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న హసీనాకు గతంలో రెండు వివాహాలు జరిగాయి. భార్య చనిపోయి పిల్లలతో ఉన్న సుల్తాన్‌కు అత్తగారి తరఫు చుట్టమైన హసీనాను ఇచ్చి మూడో వివాహం చేశారు. మొదటి భార్య కూతురు, కుమారుడితో కలిసి నలుగురు కుటుంబ సభ్యులు పట్టణ శివారులో ఉంటున్నారు. కాగా హసీనాకు గతంలో మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కొంతకాలం వీరి కాపురం సవ్యంగానే జరిగింది. భర్తకు వారసత్వంగా 1.10 ఎకరాలు రావడంతో భార్య హసీనా పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ క్రమంలో వారికి బుష్రా బతుల్ జన్మించింది. అనంతరం కుటుంబంలో వివాదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. కానీ వ్యవసాయ భూమి మాత్రం హసీనా పేరునే ఉంది. విడాకుల సమయంలో మొదటి భర్త కొంత నగదును హసీనాకు ఇచ్చాడు.
కుమార్తె బుష్రా బతుల్ వివాహం సందర్భంగా వ్యవసాయ భూమి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. కానీ అందుకు హసీనా అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి. మూడో భర్తకు హసీనాకు పిల్లలు కలగకపోవడంతో మొదటి భార్య పిల్లలనే చూసుకుంటూ జీవిస్తున్నారు. తన తండ్రి నుంచి సంక్రమించిన భూమిని తనకు ఇవ్వాలని విడాకుల సమయంలో ఇచ్చిన నగదును తీసుకోవాలని బుష్రా బతుల్ కోరినా.. హసీనా వినకపోవడంతో పలుమా ర్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు తెలిసింది. భూమికి సం బంధించిన పాసు పుస్తకాల కోసం గతంలో హసీనా ఇంట్లో చోరీ కూడా జరిగింది. అంతేగాక హత్య జరిగిన రోజున ఇంట్లో అన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. హత్య చేసిన అనంతరం నిందితులు ఇల్లంతా సోదా చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.
నల్లగొండ పట్టణంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసులో ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. పాతబస్తీలో ఉన్న రౌడీషీటర్ ద్వారా రూ. 20 లక్షలు సుపారీ కుదుర్చుకున్నట్లు తేలింది. సుపారీ గ్యాంగ్ హత్యకు ముందు పది లక్షలు, హత్య చేసిన అనంతరం మరో పది లక్షలు తీసుకుని ఉత్తరప్రదేశ్‌కు వెళ్లినట్లు సమాచారం. కాగా సుపారీ ఇచ్చిన అల్లుడు అర్హన్, కూతురు బుష్రా బతుల్ పోలీసుల అదుపులో ఉండగా హత్య చేసిన నిందితులు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలిసింది. వారి కోసం మరో రెండు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం.