– సిపిఎం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ ముత్తినేని శ్రీనివాస్‌కు వినతి
పెన్‌పహాడ్, డిసెంబర్ 22 : పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటి సభ్యుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం వారికి సిపిఎం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజా సమస్యలతో కూడిన వినతిపత్రంను సర్పంచ్‌కు అందజేశారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నారు. రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు, అర్హత ఉండి పెన్షన్ రాని వారికి పెన్షన్ అందేలా చూడాలన్నారు.
అలాగే అన్నారo లింగాల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలను పునర్నిర్మించి, విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామంలో గ్రంథాలయం, యువత కోసం ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. వీధి లైట్లు, మురుగు కాలువలు, అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని వారు కోరారు. ఇటీవల కాలంలో కోతులు, కుక్కల బెడద గ్రామంలో ఎక్కువైందని వాటిని నియంత్రించాలని కోరారు. ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఇంటికి ప్యూరిఫైడ్ వాటర్ ఉచితంగా పంపిణీ చేయాలని, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు వీరబోయిన రవి, గ్రామ శాఖ కార్యదర్శి ఐతబోయిన సత్యం, సిపిఎం వార్డు సభ్యులు ఐ.సతీశ్, వి.ఉపేంద్ర, శ్రీకాంత్, వెంకన్న పాల్గొన్నారు.