పాలకవీడు, ఫిబ్రవరి 17 : మండలంలోని జాన్పహాడ్ గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లకు ప్రైవేట్ సంస్థ పేరు రాయడంతో స్థానికులు తిరస్కరించారు. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అప్పటికప్పుడు రంగు మార్చి తప్పును సరిదిద్దుకున్నారు. జాన్పహాడ్ దర్గా వద్ద ప్రభుత్వం ఇటీవల రూ.కోటితో మౌలిక వసతుల కల్పనకు మరుగుదొడ్లు, సీసీ రోడ్లు వేయించింది. ఉర్సు ఉత్సవాలకు హాజరైన ఆదానీ సంస్థ అధికారులు దర్గా వద్ద మౌలిక వసతుల కల్పనకు కొంత ఆర్థికసాయం చేశారు.
దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు స్థానిక నాయకులు అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లకు అదానీ సంస్థ కట్టించినట్లు పేరు పెట్టారు. దీంతో గ్రామస్తులు గమనించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో స్థానిక నాయకుడు కల్పించుకొని మరుగుడొడ్లపై ఉన్న అదానీ సంస్థ పేరును తీయించాడు. జిల్లా అధికారులు దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దర్గా ఇన్స్పెక్టర్ మహమూద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్లకు ప్రైవేట్ సంస్థ పేరు రాయించడం నిజమేనని, దాన్ని అడ్డుకొని సంస్థ పేరు తొలగించినట్లు ఆయన తెలిపారు.