మిర్యాలగూడ, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో అధికార పార్టీ నాయకుల మితిమీరిన జోక్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినకపోతే దాడుల వరకూ వెళ్తుండడం అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాలో తాము సూచించిన పేర్లు మాత్రమే ఉండాలని అధికార కాంగ్రెస్ నాయకులు హుకూం జారీ చేస్తుండడంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామాల్లో సర్పంచ్ల పాలన ముగియడం, ప్రభు త్వం ఎన్నికలు జరుపకపోవడంతో పాల నా బాధ్యతలు పూర్తిగా పంచాయతీ కార్యదర్శులపైనే పడ్డాయి. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం నిర్వహణ, వీధిలైట్ల ఏర్పాట్ల వంటి అనేక బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయతీల నిర్వహణకు నిధులు రాకపోయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో వారే అప్పులు తెచ్చి మరీ సమస్యలు పరిష్కరించాల్సి వస్తున్నది.
ఇలా రూ.లక్షల్లో అప్పులు చేసిన వారూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే, ప్రభుత్వ పథకాలకు సంబంధించి సర్వేలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరో సా వంటి పథకాల విషయంలో కార్యదర్శులు సమర్ధవంతంగా చేసినా అధికార పార్టీ నాయకుల జోక్యంతో తీవ్ర సమస్య గా మారిందని వాపోతున్నారు.
బెదిరింపులు… వినకుంటే దాడులు
సంక్షేమ పథకాల అమలులో గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు కీలకంగా పని చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పథకాలకు నిజమైన అర్హులను గుర్తించేందుకు పకడ్బందీగా వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. కాగా, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు తాము చెప్పిన పేర్లు మాత్రమే అర్హుల జాబితాలో ఉండాలని బెదిరింపులకు దిగుతున్నారు. మాట వినకపోతే భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారు.
మిర్యాలగూడ మండలం ధీరావత్తం డా గ్రామపంచాయతీలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం ఇరిగేషన్ ఏఈ రామకృష్ణతో కలిసి పంచాయతీ కార్యదర్శి కోల సాయికుమార్ ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ సర్వే చేపడుతున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాను చెప్పిన పేర్లు ఎందుకు జాబితాలో చేర్చలేదని సదరు పంచాయతీ కార్యదర్శిని బెదిరింపులకు గురిచేశాడు.
తాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే ఇరిగేషన్ ఏఈతో కలిసి వెరిఫికేషన్ సర్వేలో పాల్గొన్నానని, అర్హుల జాబితా తయారీతో తనకు సంబంధం లేదని చెప్పినప్పటికీ వినకుండా సదరు నాయకుడు పంచాయతీ కార్యదర్శిపై భౌతికంగా దాడి చేశాడు. గ్రామస్తులు వారించినప్పటికీ లెక్కచేయకుండా కార్యదర్శిని దుర్భాషలాడారు. దాడికి పాల్పడిన సదరు నాయకుడిపై బాధిత కార్యదర్శి సాయికుమార్ మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శికి పలువురు మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మద్దతుగా నిలిచారు.
తాను చెప్పిన పేర్లు చేర్చలేదని దాడి చేశాడు
ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ సర్వేలో నేను ఇరిగేషన్ ఏఈతో కలిసి పాల్గొన్నాను. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు తాను చెప్పిన పేర్లు లిస్ట్‌లో ఎందుకు పెట్టలేదని దుర్భాషలాడుతూ నాపై దాడికి పాల్పడ్డాడు. పథకాల అమలులో సమర్ధవంతంగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై అధికార పార్టీల నాయకుల నుంచి బెదిరింపులు, దాడులు సరికాదు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-కోల సాయికుమార్, పంచాయతీ కార్యదర్శి, ధీరావత్‌తండా
దాడులు సరికాదు
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, దాడులు చేయడం సరికాదు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వెరిఫికేషన్ మాత్రమే జరుగుతున్నది. ఇది తుది జాబితా కాదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. కార్యదర్శిపై దాడి చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
-శేషగిరిశర్మ, ఎంపీడీఓ, మిర్యాలగూడ