నీలగిరి, జనవరి 25 : నల్లగొండ మండలంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌కు చెందిన అడిషనల్ కమాండెంట్ బి.రామకృష్ణ భారత రాష్ట్ర ప్రభుత్వం అందజేసే అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ మేరకు కరోనా వైరస్ నేపథ్యంలో భారత ప్రభుత్వం తరపున వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అయనకు అందజేయనున్నారు. బి.రామకృష్ణ మార్చి16, 1991లో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఆర్ఎస్ఐ, ఎస్ఐగా విధులు నిర్వర్తించారు.
సుమారు ఐదేండ్లపాటు పనిచేసి ఎంతోమంది ప్రముఖులకు, ముఖ్యమైన వ్యక్తులకు, సీఎం భద్రతలో ఆద్భుతమైన సేవలు అందించారు. 1998 నుంచి 2003 వరకు ఆర్ఐగా అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రభావంతమైన రీతిలో తీవ్రవాద వ్యతిరేక విధులను ప్రదర్శించి అన్ని పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో అత్యున్నత ప్రదర్శన చేశారు.
2003 నుంచి గ్రేహౌండ్స్‌కు బదిలీ అయి తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో తనదైన రీతిలో పనిచేశారు. అతని అత్యున్నత సేవలను దృష్టిలో ఉంచుకోని గ్రేహౌండ్స్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ట్రైనర్‌గా పనిచేసి దేశంలోని అన్ని వివిధ శిక్షణ కేంద్రాల్లో కోర్సులను పొందాడు. ఆయన సేవలను గుర్తించిన అప్పటి ప్రభుత్వాలు ఆయన చేసిన సేవలకుగాను 2009లో ఏపీ పోలీస్ పథకం, 2014లో ఇండియన్ పోలీస్ మెడల్, 2019లో ఉత్తమ సేవా పథకానికి ఎంపికయ్యారు. ఆయన సేవలకు మెచ్చిన తెలంగాణ ప్రభుత్వం 12వ బెటాలియన్‌కు అడిషనల్ కమాండెంట్‌గా నియమించడంతో గత రెండున్నర సంవత్సరాలు ఇక్కడే అనేక రకాల సేవలు అందించడంతోపాటు ఎంతోమంది పోలీస్ శాఖకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అందించారు.