నల్లగొండ, జనవరి 17 : హాలియా, నందికొండ మున్సిపాలిటీలలో చేపట్టవలసిన అభివృద్ధిపై పనులపై అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యుడు నోముల భగత్, ఎమ్మెల్సీ కోటి రెడ్డిలతో కలిసి హాలియా, నందికొండ మున్సిపాలిటీలలో పర్యటించారు.
హాలియాలోని నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ వెంట ఏర్పాటు చేయనున్న అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకొని స్థలాలను పరిశీలించారు. సాగర్ లెఫ్ట్ కెనాల్ వెంట జాతీయ రహదారి నుండి 200 మీటర్ల వరకూ మినీ ట్యాంక్ బండ్, మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం, పర్యాటకులు కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు, వాకింగ్ ట్రాక్, కెనాల్ గట్టు నుండి కిందికి దిగే విధంగా మధ్య మధ్యలో మెట్ల మార్గం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్ కు సూచించారు.
అంతేగాక దీనికి కూతవేటు దూరంలోనే సమీకృత వెజ్,నాన్ వెజ్ మార్కెట్ స్టేడియం, డిగ్రీ కళాశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. వైకుంఠధామంకు వెళ్లే రోడ్డుని కూడా వెడల్పు చేసి సిసి రోడ్డు నిర్మాణం నిర్మించాల్సి ఉందని కలెక్టర్ కు వివరించారు. హాలియాలోని డ్రైనేజ్ కాలువలను పరిశీలించి ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం నందికొండ మున్సిపాలిటీ లో పర్యటించి మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించినందున, నందికొండ మున్సిపాలిటీ లో ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొని 24 గంటలు తాగునీటిని అందించాలని అధికారులను కోరారు.
నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్లు డ్రైనేజీ పనులు, బస్టాండ్ ప్రాంతంలో ఒక పార్కు, టౌన్ హాల్ , లైబ్రరీ ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు నందికొండలో డబుల్ రోడ్డు నిర్మాణం, తాగునీటి కోసం చర్యలు తీసుకోవాలన్నారు.
అంతేగాక సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లపై చర్చించారు. పట్టణంలో ఆవులు, పందులు ఎక్కువగా రోడ్లపై సంచరిస్తున్నట్లు ప్రజలు తన దృష్టికి తెచ్చినందున వాటి పరిష్కారానికి ఒక గోశాల, పందుల పెంపకం కోసం ప్రత్యేకంగా రెండు ఎకరాల స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు వివరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, మిర్యాలగూడ రెవెన్యూ డివిజనల్ అధికారి రోహిత్ సింగ్, TUFIDC( పబ్లిక్ హెల్త్ ) ఎస్.ఈ. కందుకూరి వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ. పి.వెంకటేశ్వర్లు, ఈఈ సత్య నారాయణ, ఆర్.డబ్య్లు.ఎస్.ఎస్.ఈ. కెసురేష్, నందికొండ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, హాలియా మున్సిపల్ కమిషనర్ వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.