కొండమల్లేపల్లి, ఏప్రిల్ 16 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, తిరిగి కేసీఆర్‌ను సీఎం చేసేందుకు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో దేవరకొండ పట్టణంలోని విష్ణు కాంప్లెక్స్ ఫంక్షన్ హాల్లో బుధవారం నియోజకవర్గ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరితో మొదలై నేడు లక్షలాది మంది ప్రజాభిమాన్ని చూరగొన్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. సీఎంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే చరిత్ర స్పష్టించాయని గుర్తుచేశారు. కేసీఆర్ పదేండ్ల పాలన స్వర్గయుగమంటూ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు.
ఊళ్లల్లో పచ్చని చెట్లను చూస్తే హరితహారం గుర్తుకు వస్తుందని, తాగే నీటిలో మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చిన కేసీఆర్ కనిపిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో ఆయన ఆనవాళ్లను చెరిపేయడం రేవంత్‌రెడ్డి తరం కాదని తెలిపారు. హింసకు తావు లేకుండా, రాజ్యాంగ బద్ధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్మాణాత్మక పాలన అందిస్తే.. రేవంత్‌రెడ్డి పాలన దుర్మార్గంగా, రాక్షసంగా నడుస్తున్నదన్నది మండిపడ్డారు.
తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారో, రేవంత్ ఏం చేస్తున్నాడో ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు 70 శాతం కృష్ణా జాలాలను వాడుకుంటున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు ఒక్క మాట మాట్లాడడం లేదని విమర్శించారు. తెలంగాణ చంద్రబాబు చేతుల్లోకి పోతున్నదని, బాబు, ప్రధాని మోడీ ఒక్కటై రాష్ర్టాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అలివి కాని హామీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హమీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయని కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. పూర్తిగా విఫలమైయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే మోసగాళ్ల పార్టీ అన్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో ఏ గ్రామ ప్రజలను కదిలించినా కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామని ప్రజలు మదన పడుతున్నారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలనే కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మాయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న పెట్టబడులు వచ్చాయని దీంతో తెలంగాణ అభివృద్దిలో పయనించిదన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, రూ.2 వేల ఫించన్, రైతుబంధు, మిషన భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, హరితహారం, మిషన్ కాకతీయ వంటి పథకాలు, కార్యక్రమాలకు కేరాఫ్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని పేర్కొన్నారు.
కేసీఆర్ పెట్టిన బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్ బంద్ చేసిన రేవంత్ పాలన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రేవంత్ హైడ్రాతో ఇండ్లు కూల్చడం, హెచ్యూలో చెట్లను తొలగించి మూగజీవాలను ఆగం పట్టించడం పనులతో బ్రాండ్ అంబాసిడర్ మారారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి పాత సమస్యలను సృష్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీదే అధికారమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించలేని స్థితిలో ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని, గ్రామాల్లో చర్చ జరుగాలని సూచించారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రజల తరుఫున బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు.
హామీలను విస్మరించి ఢిల్లీకి కప్పం గడుతున్న రేవంత్ సర్కార్‌కు బీఆర్ఎస్ రజతోత్సవ సభ చెంపపెట్టులా మారుతుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవుతుందని తెలిపారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజోత్సవ సభను పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తమ ఇంట్లో పండుగలా భావించి తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ సంబురాలు అంబరాన్నంటాలని పిలుపునిచ్చారు.
అనంతరం చందంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్, బిల్యా నాయక్, రమావత్ తులసీ రాం నాయక్, వడ్త్యా రమేశ్‌నాయక్, గాజుల అంజనేయులు, పల్లా ప్రవీణ్‌రెడ్డి, బీఎన్‌రెడ్డి, చింతపల్లి సుభాశ్, రమావత్ దస్రూనాయక్, కేసాని లింగారెడ్డి, రాజనేని వెంకటేశ్వర్లు, నియోజకవర్గంలోని వివిధ మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్‌తోనే ప్రజలకు భరోసా
‘కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. స్వరాష్ట్రంలో ప్రజల నమ్మకం వమ్ము కాకుండా ఆయన బంగారు తెలంగాణ నిర్మాణం చేపట్టారు. ప్రజా రంజక పాలనతో దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దారు. 2000 సంవత్సరంలో పిడికెడు మందితో ప్రారంభించిన టీఆర్ఎస్ నేడు పాతికేండ్లకు చేరుతూ బీఆర్ఎస్గా రజతోత్సవం జరుపుకొంటున్నది. చావు నోట్లో తలపెట్టిన రాష్ట్రం సాధించిన కేసీఆర్ నాయకత్వంలో సభ్యులుగా ఉండడం గర్వకారణం.
16 నెలల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఏ గ్రామానికి వెళ్లినా రేవంత్ పాలనను ఛీ కొడుతున్నారు. రాబోయే రోజులు బీఆర్ఎస్వే. వరంగల్‌లో 1,200 ఎకరాల్లో ఏర్పాటుస్తున్న బీఆర్ఎస్ సభా ప్రాంగణం 25 పరేడ్ గ్రౌండ్స్‌తో సమానం. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి ఇంటి నుంచి పాల్గొని సభను సక్సెస్ చేయాలి.
-రమావత్ రవీంద్రకుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
సంబురాలు అంబరాన్నంటాలి
కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్గయుగం. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలంగాణలో భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే. రజతోత్సవ సభ సంబురాలు అంబరాన్నంటాలి. కాంగ్రెస్ అతవర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్నది. పదహారు నెలల్లో రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేసింది. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ ఇంత స్వల్పకాలంలో ఇంత అప్పు చేయలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడాలి.
-ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ