యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 26: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తులకు ప్రత్యేకమైన నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జి అందుబాటులోకి రానునంది. గత ప్రభుత్వంలోనే దాదాపు పనులు పూర్తికాగా కొద్ది పనులు మిగిలి ఉన్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఫ్లై ఓవర్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ. 69 కోట్లు వెచ్చించింది. ప్రత్యేకంగా లండన్ దేశం నుంచి నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జికి సంబంధించిన విడి భాగాలను తెప్పించింది. రోజురోజుకూ గుట్టకు భక్తులు సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇందుకోసం కొండపైకి వెళ్లే వాహనదారులకు ప్రత్యేకమైన రెండు ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టగా ఇప్పటికే ఎగ్జిట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. గత ప్రభుత్వంలోనే దాదాపుగా పనులు పూర్తి కాగా నెట్ వర్క్ ఆర్చ్‌ని బిగించాల్సి ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వీటి నిర్మాణంపై దృష్టి సారించింది. నెలలోపు బ్రిడ్జిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం యాదగిరి కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకమైన రోడ్లను నిర్మించారు. ఇందుకోసం రూ. 69 కోట్ల అంచనా వ్యయంతో రెండు ఫ్లెఓవర్లను నిర్మించగా, కొండకిందికి వెళ్లే ఎగ్జిట్ ఫ్లైఓవర్ ఏడాది కిత్రమే అందుబాటులోకి వచ్చింది. కొండపైకి వెళ్లేందుకు కొండ కింద వైకుంఠ ద్వారం సమీపంలో గల ఆర్యవైశ్య సత్రం నుంచి 12 మీటర్ల వెడల్పు, 445 మీటర్ల పొడవుతో మొదటి ఘాట్‌రోడ్డు పాత నిత్యాన్నదాన భవనం వరకు ఫ్లై ఓవర్‌ను అనుసంధానం చేశారు. ఈ ఫ్లైఓవర్‌ను 7 పిల్లర్లతో నిర్మాణం చేపట్టారు. 32 మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన స్పాన్ పనులు పూర్తయ్యాయి. ఇక లండన్ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసిన నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జిని బిగించనున్నారు. దేశంలో అత్యంత పొడవు గల 64 మీటర్ల పొడవులో ఆర్చ్ బ్రిడ్జి రానుంది. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తికాగా మిగతావి పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం త్వరలో బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని సంకల్పించిన నేపథ్యంలో త్వరలో పనులు ప్రారంభంకానున్నట్లు అధికారులు వెల్లడించారు.గతంలో మాదిరిగానే వైటీడీఏ పరిధిలో ఈ పనులు చేపడుతారా? లేక దేవస్థానం ఆధ్వర్యంలోనే పనులను కొనసాగిస్తారా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.