కట్టంగూర్, అక్టోబర్ 21 : మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) కృష్ణవేణి అన్నారు. మంగళవారం కట్టంగూర్ లోని అంగన్వాడీ కేంద్రాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులతో పాటు భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గర్భిణీలు మంచి పోషకాహారం తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆర్యోగవంతులుగా పుడుతారన్నారు. వ్యాధుల బారిన పడకుండా ప్రతిరోజు రోగ నిరోధక శక్తి కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.
గర్భిణీలు నిత్యం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించుకుని, వారి సలహాలు, సూచనలు పాటించాలన్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధి అంగన్వాడీల్లోనే సాధ్యం అన్నారు. మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు సమయపాలన పాటించడంతో పాటు గర్భిణీలు, బాలింతలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట సీడీపీఓ అస్రం అంజుం, అంగన్వాడీ టీచర్లు భిక్షమమ్మ, పద్మ ఉన్నారు.