రామగిరి, జూలై 03 : నల్లగొండ జిల్లా చర్లపల్లి గ్రామంలోని ఎంపిపిఎస్ చర్లపల్లి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు డి.వి.ఎస్.ఫణికుమార్ ఆధ్వర్యంలో ప్రీ-ప్రైమరీ విద్యార్థుల అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రీ-ప్రైమరీ విద్య చిన్నారి జీవితానికి బలమైన పునాది అన్నారు. చిన్నతనం నుంచే పిల్లల్లో చదువుపై ఆసక్తి, క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నైతిక విలువలు పెంపొందించడం ద్వారా వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకురాకుండా వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రేమ, ఓర్పు, అంకితభావంతో బోధిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పి.ఆర్.టి.యు నాయకత్వాన్ని ఆయన అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక అతిథిగా పాల్గొన్న పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలతో కూడిన విద్యను అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అరుంధతి, పి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జానారెడ్డి, స్థానిక కార్పొరేటర్ దొడ్డి రమేష్, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రీ-ప్రైమరీ విద్య చిన్నారి జీవితానికి బలమైన పునాది : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి