పెన్‌పహాడ్, అక్టోబర్ 28 : సూర్యాపేటలోనే కాదు రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపును మొండి చెయ్యి పార్టీ గాని, రెమ్మలు తెగిన కమలం పార్టీ గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఏ శక్తి అడ్డుకోలేదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని భక్తళాపురం, ధర్మాపురానికి చెందిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 50యేండ్లలో చేయని అభివృద్ధి ప్రస్తుతం ఏం వెలగబెడుతుందని విమర్శించారు.
ప్రజలను మాయ మాటలు చెప్పి ఓట్లు గడించడానికి కొందరు వస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ చెల్లని పార్టీలుగా ప్రజల్లో ముద్ర పడ్డాయన్నారు. యువత చేతిలో దేశ భవిష్యత్ ఉందని పని చేసే ప్రభుత్వానికి మద్దతు తెలిపాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృత ప్రచారం చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో పిట్టల రామకృష్ణ, తాడూరి లింగయ్య, చౌగాని సతీశ్, పిట్టల సురేశ్, చింతకాయల సతీశ్, రాజశేఖర్, నరేశ్, అంజయ్య, వెంకటేశ్‌తో పాటు మరికొంత మంది బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, బీఆర్ఎస్ మండలాద్యక్షుడు దొంగరి యుగంధర్, పీఏసీఎస్ చైర్మన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, వావిళ్ల రమేశ్, నెమ్మాది నగేశ్, జుట్టకొండ గణేశ్, నల్లపు రాంమ్మూర్తి, శేషులక్ష్మి పాల్గొన్నారు.
ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వెళ్తున్న సమయంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ గట్లపై ఉన్న రైతులతో ముచ్చటించారు. రైతులను చూసి తన కాన్వాయ్ దిగిన మంత్రి కార్యకర్తకు చెందిన బుల్లెట్ తీసుకొని కాల్వ గట్టుపై ప్రయాణం చేశారు. ఎక్కడ రైతులు కనబడితే అక్కడ ఆగి రైతులతో ముచ్చటించారు. ‘గోదావరి జలాలు ఎలా వస్తున్నాయి.. పంటలు ఎలా పండుతున్నాయి.. ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం పచ్చని మాగాణితో కళకళడుతున్నాయా లేదా.. ఇదంతా ఎవరి పుణ్యం’ అని రైతులను అడిగారు. దీనికి వారు స్పందిస్తూ సీఎం కేసీఆర్, మీ కృషి ఫలితమే అంటూ రైతులు జేజేలు కొట్టారు. రైతులతో కలిసి చెట్టు నీడనే కొంతసేపు సేదతీరారు. మాట ముచ్చట్లతో కాలం గడిపిన మంత్రికి తామంతా గులాబీ నీడలో ఉంటామని ఏ పార్టీ నాయకులు వచ్చినా.. ఎన్ని మాయ మాటలు చెప్పినా.. మీ వెంటే ఉంటామని గోదావరి జలాల సాక్షిగా మంత్రికి మద్దతు తెలుపుతూ ప్రమాణం చేశారు.