నీలగిరి, మే 16 : నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్కలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 11 నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు సుమారు 500 ఇండ్లలో తనిఖీలు చేపట్టారు. 8 మంది సీఐలు, 24 మంది ఎస్ఐలు, 80 మంది కానిస్టేబుళ్లు మొత్తం 320 మంది సిబ్బంది 28 చెకింగ్ బృందాలు, 18 కటాప్ బృందాలుగా ఏర్పడి అష్టదిగ్బంధనం చేశారు. ఈ ప్రాంతం లో పలువురు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా నుంచి వలస వచ్చి ఉంటున్నట్లు గుర్తించారు.
ప్రతి ఇంటిలోని వాహనంతోపాటు ఆధార్ కార్డులను తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి వారి ఆధార్ కార్డులతో ఆన్లైన్లో సరిచూసుకున్నారు. ఈ తనిఖీల్లో నలుగురు రౌడీ షీటర్లతోపాటు 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి గాంజా పరీక్షలు నిర్వహంచగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది. పత్రాలు సక్రమంగా లేని 165 వాహనాలను, నాలుగు ఆటోలను సీజ్ చేశారు. హుక్కా సెటప్‌ను, గాంజా చాక్లెట్ల స్వాధీనం చేసుకొని అక్రమంగా ఎయిర్ గన్ కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి మరోసారి కార్డన్ సెర్చ్‌లో దొరికితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రాఘవరావు, ఆదిరెడ్డి, కొండల్‌రెడ్డి, నాగరాజు, రాజశేఖర్, కరుణాకర్, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఎస్ఐలు సైదాబాబు, వై.సైదులు, శంకర్, గోపాల్‌రావు, సందీప్‌రెడ్డి, మానస తదితరులు పాల్గొన్నారు.
కాలనీల్లో, ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రజలకు సూచించారు. ఇండ్లల్లో కొత్తగా కిరాయికి వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అద్దెలకు ఇవ్వాలని తెలిపారు. నేరరహిత పట్టణంగా తీర్చి దిద్దడండంతోపాటు ప్రజలకు శాంతిభద్రతలు కల్పించాలని ఉద్దేశంతో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.