తుంగతుర్తి, ఆగస్టు 29 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా పందుల పెంపకం దారులు ఎస్సీ కాలనీలోని ఇండ్ల మధ్యలో పందుల గూడు ఏర్పాటు చేసి ఇష్టారాజ్యాంగా పెంచుతున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో బొంకూరి సాయి కుమార్ అనే యువకుడు బైక్పై పెద్ద చెరువు దగ్గరికి వెళ్లి వస్తుండగా ఒకసారిగా రెండు పందులు వచ్చి బండికి తగలడంతో కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంట ఉన్న స్నేహితుడు చికిత్స కోసం తుంగతుర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. పందులు ఇండ్ల మధ్యలో సంచరిస్తుంటే చిన్నపిల్లలు అనారోగ్య బారిన పడుతున్నారని, అదేవిధంగా పంట పొలాలను ఖరాబు చేస్తున్నాయని గ్రామ ప్రజలు వాపోతున్నారు. పందుల నివారణకు పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పందుల ద్వారా గ్రామ ప్రజలు ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సకాలంలో పందుల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.