నల్లగొండ ప్రతినిధి, మార్చి 25 (నమస్తే తెలంగాణ): యు ద్ధం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు ఉమ్మడి జిల్లాలో పెట్రో మంటలు రేపుతున్నాయి. రెగ్యులర్‌గా జరిగే పెట్రోల్, డీజిల్ సరఫరాలో చెప్పుకోదగిన ఆటంకాలు లేకున్నా, రానున్న కాలంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత తప్పదన్న ప్రచారం జనాన్ని ఆందోళనకు గురిచేసింది. దీంతో వా హనదారులంతా మంగళవారం సాయంత్రం నుంచే బంకులకు క్యూకట్టారు. సాధారణంగా కొట్టించే పెట్రో ల్, డీజిల్ కంటే ఒక్కసారిగా రెండు, మూడు రెట్లు అధికంగా జనం కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో బుధవారం మధ్యాహ్ననికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిల్వలు నిండుకున్నాయి. పలుచోట్ల బంకులు నోస్టాక్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది.
అయితే దీనిపై రాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందిస్తూ ఎప్పటిలాగే పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతుందని, ఎలాంటి కొరత లేదని ప్రకటించింది. జనం అనసరంగా ఆందోళనకు గురై ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. అయినా వాహనాదారులు ఎందుకైన మంచిదన్న ఉద్దేశంతో ఫుల్ ట్యాంకులకు, అవసరమైతే క్యాన్లు సైతం తెచ్చి కొనుగోళ్లు చేస్తుండడం పరిస్థితి మరింత జఠిలంగా మారింది. నల్లగొండ జిల్లాలో 220 పెట్రోల్ బంకుల ద్వారా నిత్యం సుమారు రెండు లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 500 పెట్రోల్ బంకులు ఉం డగా అటూఇటూగా రోజూ నాలున్నర లక్షల లీటర్ల ఇంధ నం వినియోగం లో ఉంది.
అయితే సాధారణ రోజుల్లో మెజార్టీ బంకుల్లో పెద్దగా అమ్మకాలు లేక యాజమాన్యాలు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కానీ ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధ నేపథ్యంలో దేశానికి పెట్రోలియం ఉత్పత్తుల రాకలో అంతరాయం కలుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. అయినా గత నెల 28న యుద్ధం మొదలైనా ఒకటిరెండు రోజుల కిందటివరకు ఎలాంటి ఇబ్బందులు క్షేత్రస్థాయిలో తలెత్తలేదు. కానీ రెండుమూడు రోజులుగా దేశీయంగా నెలకొన్న పరిస్థితులతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇందులో ప్రధాని మోదీ ప్రకటన కూడా కీలకంగా మారింది.
కరోనా నాటి పరిస్థితుల మాదిరిగానే ప్రజలు గుండె ధైర్యంతో ఉండాలి. ఎటువంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలంంటూ చేసిన ప్రకటన జనంలో మరింత చర్చనీయాంశమైంది. దీనికి తోడు ప్రధాని ప్రకటనకు సోషల్ మీడియా మరింత మసాలా దట్టిం చి కరోనా నాటి లాక్డౌన్ పరిస్థితులు కూడా వస్తాయన్నట్లుగా ప్రచారం చేయడంతో జనం లో ఆందోళన మొదలైంది. పెట్రోల్, డీజిల్ కొరత తప్పదన్నట్లుగా ప్రచారం విస్త్రతమైం ది. ఇప్పటికే గ్యాస్ కొరతతో ఆందోళనలో ఉన్న జనం పెట్రోలి యం ఉత్పత్తుల పరిస్థితి కూడా ఇలాగే ఉండవచ్చని ముందు జాగ్రత్తకు దిగారు.
ఉమ్మడి జిల్లాలో మంగళవారం మ ధ్యాహ్నం నుంచి పెట్రోల్ బం కులకు బారులుతీరడం మొదలుపెట్టారు. సాయంత్రానికి పెద్దసంఖ్యలో క్యూకట్టారు. రెగ్యులర్‌గా ఒక లీటర్ పెట్రోల్ పోయించుకునే వారు ఒక్కసారిగా ఐదారు లీట ర్లు అవసరమైతే పుల్ ట్యాంకు చేయించుకునేందుకు పోటీ పడ్డారు. డీజిల్‌కు సంబంధించి వాహనాల్లో పుల్ ట్యాంకులతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం పెద్ద పెద్ద క్యాన్లతో క్యూ కట్టారు. దీంతో బుధవారం ఉదయం సరికే పలుచోట్ల బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఖాళీ అయ్యింది. క్రెడిట్ సౌకర్యం నిలిపివేత..
మరోవైపు ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకు యజమానులకు ఇచ్చే క్రెడిట్ సౌకర్యం ఉన్నట్లుండి నిలిపివేత కూడా సమస్యను మరింత జఠిలం చేసింది. ఈనెల మొదటివారంలో ఆయిల్ కంపెనీల నిబంధనలు మారడంతో ఎప్పటి నుంచో కొనసాగుతున్న క్రెడిట్ సౌకర్యం నిలిచిపోయింది. గతంలో కంపెనీలకు ఇండింట్ పెడితే బంకులకు ఆయిల్ ట్యాంకర్లు పంపేవారు. ట్యాంకర్ దిగుమతి అయ్యాక ఐదు రోజుల్లోపు బంకు యజమాన్యాలు డబ్బు చెల్లించేవారు. కానీ 20 రోజులుగా ఇలాంటి సౌకర్యాన్ని కంపెనీలు నిలిపివేశాయి. దీంతో ముందే డబ్బు చెల్లిస్తేనే ట్యాంకర్లు వస్తున్నాయి.
జిల్లాలోని 20 నుంచి 25శాతం బంకు యజమాన్యాలు క్రెడిట్ సౌకర్యం నిలిపివేయడంతో స్టాక్ తేవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు అంచనా. ప్రస్తుతం నో స్టాక్ బోర్డులకు ఇది కూడా ఓ కారణంగా మారింది. మంగళవారం ఉదయం నుంచి పెట్రోల్, డీజిల్ దొరకదేమోనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం కూడా జనం ఎగబడడానికి మరో కారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఎలాంటి కొరత లేదు… జనం పుకార్లను నమ్మవద్దు… ఎప్పటిలాగే పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతుందని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటన చేసినా…. జనం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీనివల్ల సాయంత్రానికి దాదాపు మెజార్టీ బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేదన్న బోర్డులు దర్శనమిచ్చాయి. సాధారణంగా ఒక్క రోజుల్లో సగటున డైలీ వెయ్యి లీటర్ల పెట్రోల్ అమ్ముడుపోయే బంకుల్లో నిన్న ఒక్క రోజులోనే మూడు వేల లీటర్ల పెట్రోల్ కూడా గంటల్లోనే ఖాళీ అయినట్లు బంకు యాజమాన్యాలు చెబుతున్నాయి.
ఆందోళన అవసరం లేదు : ఎల్వీ కుమార్
పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని, సాధారణ రోజుల్లో మాదిరిగానే కంపెనీలు సరఫరా చేస్తున్నాయని నల్లగొండకు చెందిన రాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కోశాధికారి ఎల్వీ కుమార్ స్పష్టం చేశారు. సోషల్‌మీడియాలో వచ్చే వార్తలతోపాటు జనం పుకార్లను నమ్మి ఆందోళనకు గురికావద్దని సూచించారు. ఎప్పటిమాదిరిగానే సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు కంపెనీల వద్ద ఉన్నాయని, అక్కడి నుంచి బంకులకు సరఫరా అవుతుందని చెప్పారు. జనం ఆందోళన, ఆత్రుతతో ఒక్కసారిగా భారీగా కొనుగోళ్లకు ఎగబడడంతోనే ఇబ్బందులు తలెత్తుతుందన్నారు. రోజు వారీ అవసరాల వినియోగం వరకే పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేయాలని, ముందు జాగ్రత్తగా ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రెండూమూడు రోజుల్లో అంతా సర్ధుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కొరత లేదు.. ఆందోళన వద్దు
పెట్రోల్, డీజిల్ సమస్యపై కలెక్టర్ చంద్రశేఖర్ విజ్ఞప్తి
నల్లగొండ జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాల్లో ఎలాంటి ఇబ్బందిలేదని, కొరత అస్సలే లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా ఆందోళనలకు గురై ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ సరఫరాపై పౌరసరఫరాల అధికారులు, డీలర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో కొన్నిచోట్ల పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్‌మీడియాలో వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. జిల్లాలో సరిపడినంత పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.
వినియోగదారులు వదంతులను నమ్మి ఒక్కేసారి కొనుగోళ్లు జరపడం సరికాదన్నారు. సరిపడా నిల్వలు ఉన్న నేపథ్యంలో బంకుల వద్ద ఎలాంటి నోస్టాక్ బోర్డులు పెట్టవద్దని డీలర్లను ఆదేశించారు. సక్రమ సరఫరా కోసం క్షేత్రస్థాయిలో పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టాలన్నారు. సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా తగు సూచనలు చేశారు.