గరిడేపల్లి, జూన్ 19 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతరెడ్డి అన్నారు. గత 11 ఏళ్లలో కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్, పీఎం కిసాన్, ఉజ్వలా యోజన, జనధన్, ముద్రా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచినట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, కీతవారిగూడెం గ్రామంలో బీజేపీ గరిడేపల్లి మండల అధ్యక్షుడు కుక్కడపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం బీజేపీ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో ఆమె మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశ భద్రత బలోపేతం అయిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల నాణ్యమైన సన్న బియ్యం అందుతున్నట్లు చెప్పారు. ఈ పథకం ప్రధాని మోదీకి సామాన్యులపై ఉన్న నిబద్ధతను స్పష్టం చేస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో కార్యాచరణ వేగవంతం చేయాలని, యువతను పార్టీలో చేర్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.