నీలగిరి, ఆగస్టు 07 : వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని ఏఆర్ నగర్లో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన కాలనీలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున మురికి నీరు అధికంగా వచ్చి దోమలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.
దోమల ఉధృతి కారణంగా ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల బారిన పడి ఆరోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నట్లు తెలిపారు. ఇంటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీరు పోకుండా నిల్వ ఉంటే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు ఒకటిరెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే వెంటనే దగ్గరలోని పీహెచ్సీకి రావాలని కోరారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.