నల్లగొండ ప్రతినిధి, నవంబర్8(నమస్తే తెలంగాణ) : ప్రజా భాగస్వామ్యంతో మూసీ ప్రక్షాళనకు పూనుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న మాటలకు, ఆచరణకు పొంతన లేదని మరోసారి స్పష్టమైంది. శుక్రవారం వలిగొండలో సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర అడుగడుగునా ఆంక్షలు, అరెస్టులు, తీవ్ర నిర్భంధాల నడుమ కొనసాగడమే అందుకు నిదర్శనం. రుణమాఫీ, రైతుభరోసా రాక, ధాన్యం కొనుగోళ్లు జరుగక రైతులు, అలైన్మెంట్ మార్పులు కోరుతున్న ట్రిపుల్ ఆర్ బాధితులు, దానీ సిమెంట్ కంపెనీని అనుమతలు ఇవ్వదంటూ రామన్నపేటవాసులు, ఆరు గ్యారెంటీల అమలులో నెలకొన్న వైఫల్యాలు… వెరసి ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుందన్న భయం అధికార పార్టీ నేతలను వెంటాడింది. దాంతో రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అడుగడుగునా పోలీసులను మోహరించి విపక్ష నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధించారు. మూసీ ప్రక్షాళనకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని చెప్తున్న ప్రభుత్వ పెద్దలకు ఇంత భయమెందుకుని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా పాలన అంటూనే ప్రజలను నిర్బంధించి కొద్దిమంది ఎంపిక చేసిన కాంగ్రెస్ శ్రేణులతో సంకల్ప యాత్రను నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వలిగొండ మండలం సంగెం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన మూసీ యాత్రలో అడుగుడుగునా ఆంక్షలు కొనసాగాయి. మూసీ పరివాహాక ప్రాంతాన్ని మొత్తం రెండు రోజుల కిందటే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ పరిసర గ్రామాల ప్రజలకు అనుమతి లేకుండా అక్కడికి రావద్దంటూ ముందే హెచ్చరికలు జారీ చేశారు. ఇక మూసీ నదీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మట్టిరోడ్డులో రేవంత్‌రెడ్డి కొద్దిదూరం చేసిన పాదయాత్రలో సైతం కేవలం ముందస్తు అనుమతి ఉన్న నేతలను, కొద్దిమంది ఇతరులను మాత్రమే అనుమతించారు. మిగిలిన వారంతా సభాస్థలికే పరిమితం అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ మినహా మిగతా అన్ని పార్టీల, ప్రజాసంఘాల నేతలను, ముఖ్య కార్యకర్తలను ఎక్కడిక్కడ పోలీసులు నిర్బంధించారు. ఇంతటి నిర్బంధం నడుమ సాగిన యాత్రలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తన పుట్టిన రోజున మూసీ ప్రక్షాళన యాత్రను చేపట్టడంతో జన్మధన్యమైందని ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తమవుతున్నది.
అర్ధరాత్రి నుంచే..
రేవంత్‌రెడ్డి పర్యటనకు ప్రజల నుంచి నిరసనల సెగలు, నిలదీతలు తప్పవని భావించిన జిల్లాకు చెందిన మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు పోలీసులను రంగంలోకి దింపారు. గురువారం సాయంత్రం నుంచే యాదాద్రి భువనగిరి జిల్లాతోపాటు నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లోని విపక్ష నేతలు, ముఖ్య కార్యకర్తలకు ఫోన్లలో బెదిరింపులు మొదలయ్యాయి. సీఎం మూసీ యాత్రపై ఆరా తీస్తూ తమకు లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు బీఆర్ఎస్, బీజేపీ. సీపీఎం, సీపీఐ, పలు ప్రజాసంఘాల నేతలపై నిఘా పెట్టి అరెస్టుల పర్వానికి తెరలేపారు. ముఖ్యంగా భువనగిరి, ఆలేరు, నకిరేకల్, మునుగోడు, నల్లగొండ, తుంగతుర్తి నియోజకవర్గాల నాయకులపై కన్నేసి అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. తెల్లవారే సరికి ఆయా ప్రాంతాల్లోని విపక్ష నేతలందరినీ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రేవంత్‌రెడ్డి రాక నేపథ్యంలో అరెస్టు చేశామంటూ సాయంత్రం వరకు అక్కడే ఉంచారు.
మాజీ ఎమ్మెల్యేల అరెస్టు…
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై గురువారం సాయంత్రం నుంచే నిఘా పెట్టారు. లింగయ్య ముందు జాగ్రత్తగా మరోచోట ఉన్నా సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రాకింగ్‌తో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ముందు గృహ నిర్బంధం చేశారు. తర్వాత బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ వాహనాల్లో అటూ ఇటూ తిప్పుతూ చివరకు మునుగోడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల నిర్బంధాన్ని లింగయ్య తీవ్రంగా ఖండించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని కొత్తపేటలోని నివాసంలో నిర్బంధించారు. ఆ తర్వాత చైతన్యపురి పీఎస్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని నల్లగొండలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సాయంత్రం వరకు ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతోపాటు డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వీరితోపాటు కీలక నేతలందరినీ అదుపులోకి తీసుకున్నారు.
అనుమానం వచ్చిన ప్రతీ ఒక్కరినీ…
రేవంత్‌రెడ్డి పర్యటనకు నిరసన సెగ తగలకుండా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేశారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్న బాధితులను చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. చౌటుప్పల్‌లో బీఆర్ఎస్, సీపీఎం నేతలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇక రామన్నపేట, కట్టంగూరు, నకిరేకల్, నార్కట్‌పల్లి, చిట్యాల, కేతేపల్లి, శాలిగౌరారం, తిప్పర్తి, చిట్యాలలో బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆలేరులో బీఆర్ఎస్, బీజేపీ నేతలను, బీబీనగర్‌లో బీఆర్ఎస్వీ, వలిగొండ, రాజపేటలో బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. పోచంపల్లిలో, బొమ్మలరామారం, మోత్కూరులో ఆత్మకూర్(ఎం).లో బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. యాదగిరిగుట్ట, ఆలేరులో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ నేతల అరెస్టు చేశారు. ఇక వేర్వేరు ప్రాంతాల్లో బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, లంబాడీ హక్కుల పోరాట సమితి, ఇతర ప్రజాసంఘాల నేతలను సైతం అక్రమంగా అరెస్టు చేశారు.