నల్లగొండ ప్రతినిధి, మార్చి19(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్ధిక శాఖ మంంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర పథకాలకు సైతం అరకొర నిధులు కేటాయించడంపై విపక్ష, ప్రజాసంఘాల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల మాటలు కోటలు దాటుతున్నా… చేతలు గడప దాటడం లేదన్నట్లు కేటాయింపులు ఉన్నాయని మండిపడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ మూడేండ్లలో పూర్తి చేస్తామని వేదికలపై గొప్పలకు పోతున్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిధుల సాధనపై మాత్రం శ్రద్ధ పెట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నా ప్రాజెక్టులకు కేటాయింపుల్లో ఆయన మార్క్ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మిగిలిపోయిన రైతులకు రుణమాఫీకి సంబంధించి నిధుల ప్రస్తావన లేకపోవడంతో ఆశలు వదులుకోవాల్సిందేనన్న సందేహాలు మొదలయ్యాయి. రైతుభరోసాకు ప్రభుత్వం చేసిన కేటాయింపులు చూస్తే అందరికీ ఇచ్చేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ లెక్కలు చూస్తే ఆరు గ్యారెంటీల అమలు కూడా ప్రశ్నార్థకంగా మారింది. కీలకమైన విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం పట్ల ఉమ్మడి జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు అరకొరగా…
ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు ప్రాజెక్టులు ఇరిగేషన్ సర్కిల్స్‌లోకి వస్తుండగా వీటిన్నింటినీ కలిపి పరిశీలించినా కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. సూర్యాపేట సీఈ సర్కిల్ పరిధిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశకు నిధుల కేటాయింపులు గతంలో మాదిరిగా రూ.34.01కోట్లే ఉంది. మూసీకి సంబంధించి గతంలో రూ.64కోట్లు ఉంటే ఈసారి రూ.50 కోట్లకు తగ్గించారు. నల్లగొండ సీఈ సర్కిల్ పరిధిలో ఏఎమ్మార్పీ కోసం రూ.899 కోట్ల కేటాయింపులు చూపారు. గతంతో పోలిస్తే వంద కోట్లు అదనంగా కనిపిస్తున్నా ప్రభుత్వం చెప్తున్న ప్రకారం దీని పరిధిలోని ప్రాజెక్టులు మూడేండ్లల్లో పూర్తి కావాలంటే ఎలా సరిపోతాయన్నది తేలాల్సి ఉంది. ఇందులోనే కీలకమైన ఎస్ఎల్బీసీ సొరంగమార్గంతోపాటు పెండ్లిపాకల రిజర్వాయర్, లింక్ కెనాల్ పనులన్నీ చేపట్టాల్సి ఉంది. టన్నెల్ ఇన్లెట్ వైపు కూలిన సొరంగ మార్గం పరిస్థితి ఏంటనేది స్పష్టత లేదు.
ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వతోపాటు డ్రిస్ట్రిబ్యూటరీ కాల్వల లైనింగ్ పనులను రూ.600 కోట్లతో చేపట్టి ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని గత వారమే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మొత్తం కేటాయింపులే రూ.899 కోట్లు అయితే ఇవన్నీ ఎలా సాధ్యమనేది మంత్రులే చెప్పాల్సి ఉంది. దీని పరిధిలోకే వచ్చే బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకంలో కీలకమైన భూసేకరణతోపాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తవ్వకానికి కనీసం రూ.200 కోట్ల తక్షణం అవసరం ఉన్నట్లు అంచనా. ఆ కేటాయింపులపైనా స్పష్టత లేదు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వతోపాటు కృష్ణానదిపై నిర్మిస్తున్న 14 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. గజ్వేల్ సీఈ సర్కిల్ పరిధిలోకి వచ్చే ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాల్వల పరిపాలన అనుమతుల గురించి మంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో ప్రస్తావించినా నిధుల కేటాయింపు మాత్రం లేదు. ఇదే సర్కిల్ పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో రూ.2,699 కోట్ల కేటాయింపులు కనిపిస్తున్నా ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వలు, ఇతర పనుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
మిగిలిన రుణమాఫీ సంగతి అంతేనా?
ఉమ్మడి జిల్లా పరిధిలో రుణమాఫీ 60 శాతానికి మించి కాలేదన్నది వాస్తవం. 5.50 లక్షల మంది రుణమాఫీకి అర్హులైన రైతులు ఉండగా 3.85లక్షల మందికే రుణమాఫీ జరిగింది. మిగతా లక్షన్నర మందికి పైగా రైతులు రుణమాఫీ కోసం ఏడు నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ బడ్జెట్లోనైనా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే రుణమాఫీ అవుతుందని రైతులు భావించారు. మిగిలిన రుణమాఫీ గురించి ప్రస్తావనే లేకపోవడంతో ఆశలు వదులు కోవాల్సిందేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైతుభరోసా నిధుల కేటాయింపు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఉమ్మడి జిల్లాలో గతంలో కంటే భారీగా కోతలు పడొచ్చని రైతుసంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. వానకాలం సన్నాలు పండించిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు ఇవ్వాల్సిన బోనస్ డబ్బులకు కూడా కేటాయింపులు జరుగలేదు. దాంతో ఉమ్మడి జిల్లాలో రూ.47.95 కోట్ల బోనస్ ప్రశ్నార్థకంగా మారింది.
రహదారుల విస్తరణ ఎప్పటికో!
జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్అండ్బీ శాఖ మంత్రిగా ఉన్నా ఆయన మార్క్ బడ్జెట్లో కనిపించ లేదు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక రోడ్లుగా ఉన్న చిట్యాల-భువనగిరి, నల్లగొండ-కొండమల్లేపల్లి రహదారుల విస్తరణ పనులపై ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ వీటి ప్రస్తావన లేకపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. మండల కేంద్రాల మధ్య, ప్రధాన గ్రామాల మధ్య అనేక రోడ్లు విస్తరించాల్సి ఉన్నా, వాటికీ నిధుల్లేవు. అధికార కాంగ్రెస్ నేతలు మినహా బీఆర్ఎస్తోపాటు మిగతా విపక్ష నేతలు, ప్రజాసంఘాల నేతలంతా ఈ బడ్జెట్ ఆశాజనకంగా లేదని, కేవలం అంకెల గారడీని తలపిస్తున్నదని విమర్శలు గుప్పించడం గమనార్హం.
వైద్య, విద్య మౌలిక వసతుల కల్పన ఏది?
గత కేసీఆర్ ప్రభుత్వం విద్య, వైద్యరంగాలతోపాటు పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ పెద్ద పీట వేసేది. రేవంత్ సర్కార్ వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్లు బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాకు కొత్తగా ఒక్క విద్యాలయం గానీ, వైద్య రంగంలో ప్రత్యేక ఏర్పాట్లు గానీ బడ్జెట్లో కనిపించ లేదు. యాదాద్రి మెడికల్ కాలేజీ ఊసేలేదు. జిల్లా కేంద్ర ఆస్పత్రుల విస్తరణకు నిధుల కేటాయింపులు లేవు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ భవనాలను ప్రస్తావించినా ప్రత్యేకంగా నిధుల కేటాయింపు కనిపించ లేదు.
ప్రజలపై భారం మోపే విధంగా బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలపై పన్నుల భారం, అధిక ధరలు పెంచే విధంగా ఉంది. విద్యారంగానికి కేవలం 7.57 శాతం నిధులే కేటాయించారు. దేశంలోని మిగతా రాష్ర్టాల్లో సగటున 14 శాతం నిధులు కేటాయిస్తున్నారు. విద్యా వైద్యంపై జరిగే కేటాయింపులను బట్టి మానవ వనరుల అభివృద్ధి సాధ్యం. ప్రస్తుత బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించింది 12,393 కోట్లు. రాష్ట్రంలో పెరిగిన ద్రవ్యోల్బన శాతాన్ని బట్టి చూస్తే రాష్ట్ర బడ్జెట్ గత బడ్జెట్ కంటే పెరగలేదని చెప్పవచ్చు.
– బడుగుల సైదులు, ఆర్థిక విశ్లేషకుడు (కోదాడ)
విద్యారంగానికి అరకొర నిధులే..
రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా ఉంది. విద్యా రంగానికి కేవలం 7.5శాతం మాత్రమే కేటాయించడం సిగ్గుచేటు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు నిరుద్యోగ భృతి లేదు. విద్యార్థినులకు స్కూటీల ఊసే లేదు. సంక్షేమ వసతి గృహాలు, యూనివర్సిటీలకు, ఫీజు రీయింబయర్స్మెంట్కు అరకొర నిధులు కేటాయించారు. ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నది.
– బొమ్మరబోయిన నాగార్జున , బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్లగొండ (రామగిరి)
బడ్జెట్లో బీసీలకు అన్యాయం
రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రతి సంవత్సరం బడ్జెట్లో బీసీలకు 20వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. కానీ 11వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఎస్సీలకు 40వేల కోట్లు, ఎస్టీలకు 17వేల కోట్లు కేటాయించి బీసీలపై చిన్నచూపు చూశారు.
-దూళిపాల ధనంజయ్యగౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సూర్యాపేట టౌన్)
ఇది నయవంచక బడ్జెట్
ఇది నయవంచక బడ్జెట్. దీనిలో అంకెల గారడి తప్ప పస లేదు. ఈ బడ్జెట్‌తో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజా విశ్వసనీయత పూర్తిగా కోల్పోయ్యింది. హామీలను అమలు పర్చే విధంగా నిధుల కేటాయింపు జరుగలేదు. ఆరు గ్యారెంటీల అమలుకు మంగళం పాడుతున్నట్లు చెప్పకనే చెప్పారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఊసే లేదు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు నెలకు 4 వేల రూపాయల పింఛన్ మాటేలేదు. ప్రజలు ఆశతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మోసం చేశారు. ఈ బడ్జెట్‌తో కాంగ్రెస్ దివాళకోరుతనం మరోసారి బయటపడింది.
– ఎంసీ కోటిరెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఉమ్మడి నల్లగొండ జిల్లా
బడ్జెట్ పేరుకే గొప్ప
రాష్ట్ర బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. బడ్జెట్ మొత్తంలో 226 లక్షల కోట్లు రెవె న్యూ వ్యయంగా కేవలం 36 లక్షల కోట్లు మూల ధన వ్యయంగా చెప్పా రు. ఎటువంటి ప్రాజెక్టులు గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయం లేదు. సుమారు 70 వేల కోట్ల లోటును మళ్లీ అప్పుల ద్వారా, 24 వేల కోట్లు హైదరాబాద్‌లో విలువైన స్థలాలను అమ్మడం ద్వారా సమకూర్చుకోనున్నట్లు చెప్పారు. రెవెన్యూ వ్యయంలో ఆరు గ్యారెంటీల అమలుకు ప్రత్యేక నిధుల ప్రస్తావన లేదు. ఈ బడ్జెట్ అంతా గత ప్రభుత్వ బడ్జెట్ ప్రణాళిక పద్దులను యథాతథంగా అంకెలను పెంచినట్లు ఉంది.
-పెద్దిరెడ్డి గణేశ్, బ్యాంకింగ్ రంగ నిపుణుడు (సూర్యాపేట టౌన్)