సూర్యాపేట/చివ్వెంల, ఫిబ్రవరి 6 : భేరీ మోతలు.. గజ్జెల సవ్వడులు.. అవుసరాల విన్యాసాల మధ్య మంద గంపలు, యాటపోతులతో భక్తజనం పెద్దగట్టుకు పోటెత్తింది. లక్షల గొంతులు ఒ లింగా.. ఓ లింగా నామస్మరణను హోరెత్తించాయి. ఇలవేల్పును కొలిచేందుకు తరలివచ్చిన యాదవ కుటుంబాలు లింగమంతులస్వామి, చౌడమ్మకు బోనాలు సమర్పించాయి. 80వేలకుపైగా పొట్టేళ్లను మొక్కుగా చెల్లించాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా విందు చేసుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ పెద్దగట్టు పరిసరాల్లో ఇసుకేస్తే రాలనంత జన సందోహం కనిపించింది. ఎగ్జిబిషన్లో చిన్నాపెద్ద హుషారుగా గడిపారు. మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి,
తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజుయాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. జాతరలో భాగంగా మంగళవారం చంద్రపట్నం వేసి, లింగమంతుల స్వామి కల్యాణోత్సవం జరిపించనున్నారు.
పెద్దగట్టు జాతర ధూంధాంగా సాగుతున్నది. సోమవారం భారీగా జనం తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఒ లింగా.. ఓలింగా నామస్మరణ మార్మోగగా.. భేరీల మోతలు, గజ్జెల లాగుల సవ్వడులతో యాదవుల సంప్రదాయ నృత్యాలు అలరించాయి. గుట్ట చుట్టూ ఎటుచూసినా జన సందడి కనిపించింది.
రెండో రోజు మద్దెర, ముత్యాల, లగ్గం పోలు
దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరలో రెండో రోజు సోమవారం తెల్లవారుజామున మద్దెరపోలు, ముత్యాలపోలు, లగ్గంపోలు కార్యక్రమాలను నిర్వహించారు. బైకాని వంశస్తులు వాయిద్యాల నడుమ గొల్లల చరిత్రను కథల రూపంలో చెబుతుండగా ఆలయహక్కు దారులైన మున్న, మెంతబోయిన, గొర్లవారి సమక్షంలో మద్దెరపోలు జరిపించారు. బైకాని ప్రధాన పూజారి లింగమంతుల స్వామి, చౌడమ్మ గర్భగుడి ఎదుట పెట్టిన దేవరపెట్టె వద్ద పసుపుతో ముగ్గు వేశారు. ముగ్గులపై పోలుముంతలు ఉంచారు. రెండు మట్టి కంచుడులో నెయ్యి, నువ్వుల నూనె పోసి దీపారాధన చేశారు. బైరవ ఆకారంలో వేసిన ముగ్గులపై కుడుకలు, తమలపాకులు, నిమ్మకాయలు, జీడిగింజలు పెట్టి బైకాని వంశస్తులు మైసాక్షితో ధూపం వేసి కర్పూరాలు వెలిగించి హారతులు ఇచ్చారు. ఇక్కడ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పూజలు చేశారు.