సూర్యాపేట, ఆగస్టు 3 : సూర్యాపేట జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న నీట్ పీజీ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో 179 మంది విద్యార్థులకు గాను 171 మంది హాజరయ్యారని 8 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే కోదాడ సనా ఇంజనీరింగ్ కళాశాలలో 50 మందికి గాను 44మంది హాజరు కాగా ఆరుగురు గైర్హాజరైనట్లు తెలిపారు.
నీట్ పీజీ ప్రవేశ పరీక్ష సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు అభ్యర్థులు ఉరుకుల పరుగులతో పరీక్షా కేంద్రానికి రావడం కనిపించింది. ప్రవేశ ద్వారం వద్ద అభ్యర్థుల గుర్తింపు కార్డులను అదనపు కలెక్టర్ రాంబాబు పరిశీలించారు. ఆయన వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జయలత, తాసీల్దార్ కృష్ణయ్య, అధికారులు, సిబ్బంది ఉన్నారు.