కోదాడ, ఆగస్టు 22 : పుస్తక పఠనంతో విద్యార్థులు మేధాశక్తిని పెంచుకుని తమ భావి జీవితాలకు ఉన్నత బాటలు వేసుకోవాలని కోదాడ పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు బొల్లు రాంబాబు అన్నారు. శుక్రవారం పబ్లిక్ క్లబ్లో నవ తెలంగాణ పబ్లిషర్స్ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను సందర్శించిన తేజ టాలెంట్ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రాథమిక విద్యా దశ నుండి విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన పుస్తకాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. భవిష్యత్లో పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుండే ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలను అవగతం చేసుకునేందుకు పుస్తక పఠనం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు, రచయిత ఉప్పాల కృష్ణమూర్తి, వంశీ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.