లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్టో
యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్ధన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 24 : పాతగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం వైభవంగా చక్రతీర్థస్నానం జరిపించారు. కల్యాణం, రథోత్సవంతో అలసిన స్వామివారికి చక్రతీర్థ సేవ నిర్వహించి శృంగార డోలోత్సవానికి సిద్ధం చేశారు. నిత్యారాధనల అనంతరం పారాయణికులచే చతుర్వేద పారాయణాలు, యాజ్ఞీకులచే నిత్య హవనం, మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలు జరిపారు. అనంతరం మహాపూర్ణాహుతి మహోత్సవాన్ని పాంచరాత్రగమశాస్త్రరీతిలో అత్యంత వైభవంగా చేపట్టారు. మధ్యాహ్నం చక్రతీర్థ మహోత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యాజ్ఞాచార్యులు, అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు.
భక్తులు తమ మనస్సు, తనువును ఒక్కటిచేసి శ్రీ నారసింహ.. జయ నారసింహ అంటూ జయజయ ధ్వానాలు చేస్తూ లక్ష్మీనరసింహస్వామి వారి శ్రీచక్రాళ్వార్కు జరిపించిన చక్రతీర్థ మహోత్సవాన్ని తిలకించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా లక్ష్మీనరసింహస్వామి శ్రీచక్రాళ్వార్తో కలిసి మంత్రపూర్వక స్నానం గావించారు. స్థానిక భజన మండలి సభ్యులు భజన నిర్వహించారు. ఆలయంలో వేదపారాయణాలు జరిపారు.
శ్రీపుష్పయాగం.. డోలారోహణం పాతగుట్టలో సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం, డోలారోహణం, దేవతా ఉద్వాసన వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహుడి ఉత్సవాలకు ఆహ్వానించిన దేవతలను మంత్రముల చేత ఆహ్వానించిన పిదప తిరిగి వారి స్వస్థలాలకు సంప్రదాయంగా పంపించే దేవతా ఉద్వాసన వేడుక అత్యంత వైభవంగా సాగింది. భగవానుడి నామాలతో అర్చన వేడుకలు నిర్వహించే ప్రక్రియను శ్రీపుష్పయాగం పాంచరాత్రగమశాస్త్రరీతిలో చేపట్టారు.
సహస్ర నామాలతో అమ్మవారిని, భగవానుడిని పుష్పాలతో ఆరాధించారు. కార్యక్రమాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ రామకృష్ణారావు, డీఈఓ దోర్బల భాస్కర్‌శర్మ, ఏఈఓ గజవెల్లి రమేశ్‌బాబు, ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, యాజ్ఞీకులు కిరణ్‌కుమారాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, శ్రీధరాచార్యులు, అధ్యాపకులు నల్లన్‌థిఘళ్ సీతామనోహరాచార్యులు, పారాయణందారులు నర్సింహాచార్యులు, జగన్మోహనాచార్యులు, వేణగోపాలాచార్యులు, ఆలయ అధికారులు శ్రీకాంత్, విజయకుమార్, వేద పండితులు పాల్గొన్నారు.
పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం 10 గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించనున్నారు. మధ్యా హ్నం 12.30 గంటలకు మహదాశీర్వచనం, పండిత సన్మానం నిర్వహించి బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేయనున్నారు.