నీలగిరి, నవంబర్21 : అంకితభావం, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు అన్నారు. నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో గురువారం సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు చెందిన 265 మంది ఏఆర్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది నెలలపాటు ఎంతో కఠోర శ్రమను ఓర్చుకొని కానిస్టేబుల్స్ శిక్షణను పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో శిక్షణ పూర్తి చేసుకున్నారని, నూతన ఉత్సాహంతో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని తెలిపారు.
పోలీస్ శాఖలో ఉద్యోగం అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉన్పప్పుడే దేనినైనా ఎదుర్కోగలమని చెప్పారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు శరత్చంద్ర పవార్, సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసిన కానిస్టేబుల్స్ విధి నిర్వహణలో చాలా చురుకుగా ఉండాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూనే శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. అనంతరం శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన బెల్ ఆల్‌రౌండర్ జె.అనిల్, బెస్ట్ ఇండోర్ ఆర్. మహేశ్, బెస్డ్ డోర్ ముజిబుద్దీన్, బైస్ట్ ఫైర్ టి. ప్రశాంత్, పరేడ్ కమాండర్ నరేశ్‌కు అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో ట్రైనీ కానిస్టేబుళ్లు సంతోషంగా గడిపారు. అంతా కలిసి భోజనం చేసి, ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములునాయక్, రమేశ్, డీటీసీ డీఎస్పీ విఠల్‌రెడ్డి, నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు డానియల్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి, హరిబాబు, శ్రీను, సంతోష్, ఎస్ఐలు ప్రవీణ్, శ్రీనివాస్, భరత్, ఆర్ఎస్ఐ అభిల్చంద్ర, పోలీస్ అధికారుల సంఘం నాయకులు జయరాజు, సోమయ్య ఇండోర్, అవుట్ డోర్ సిబ్బంది పాల్గొన్నారు.